పెద్ద హీరోల సినిమాల కథలకు పాయింట్ రాసుకునేటప్పుడు వీలైనంత ఎవరూ ట్రై చేయనిది చూస్తుంటారు దర్శకులు. అయినా సరే ఎంత జాగ్రత్త తీసుకున్నా కొన్నిసార్లు పోలికలు వచ్చేస్తాయి. కల్కి 2898 ఏడి, కంగువకు అలాంటి సారూప్యత రావడం మూవీ లవర్స్ లో చర్చకు దారి తీసేలా ఉంది. ముందు కల్కి సంగతి చూస్తే శ్రీవిష్ణువు అంశతో పుట్టిన భైరవ పాత్ర వందలాది సంవత్సరాలు ప్రయాణం చేస్తూ మహాభారత కాలం నుంచి వర్తమానం దాకా సాగుతుంది. అంటే 3102 బిసి నుంచి భవిష్యత్తులో రాబోయే 2898 ఏడి దాకా వివిధ రకాల యుగాల్లో నాగఅశ్విన్ విహారం చేయిస్తాడు.
ఇక కంగువ విషయానికి వస్తే 1678లో మనుగడ సాగించిన ఓ అటవీ జాతి పోరాట యోధుడు 2024లో వచ్చి ఒక రీసెర్చ్ స్టూడెంట్ సహాయంతో పూర్తి కాకుండా ఆగిపోయిన తన లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పూనుకుంటాడు. అంటే కల్కి, కంగువ రెండింట్లోలోనూ ప్రభాస్, సూర్యలు రకరకాల గెటప్పులు, స్టయిల్స్ తో కనిపిస్తారన్న మాట. బ్యాక్ డ్రాప్ వేరుగా ఉన్నా మెయిన్ థీమ్ మాత్రం దగ్గరగా ఉంటుందని వినికిడి. వీటికన్నా ముందు కళ్యాణ్ బింబిసారలో ఇదే తరహా బ్యాక్ డ్రాప్ తో వశిష్ట మెప్పించడం చూశాం. చిరంజీవి విశ్వంభరలోనూ ఈ ట్రీట్ మెంట్ ఉంటుందట.
చెప్పిన ప్రకారం కట్టుబడితే కంగువ కన్నా ముందు కల్కి 2898 ఏడి రిలీజవుతుంది. ఎన్నికలు ఉన్నా సరే మే 9 రిలీజ్ చేస్తామని వైజయంతి నుంచి అందుతున్న సమాచారం. ఖచ్చితంగా కట్టుబడే తీరుతారని చెప్పలేం కానీ దర్శకుడు నాగ అశ్విన్ మాత్రం ఆ డెడ్ లైన్ కోసమే పని చేస్తున్నాడు. కంగువ డేట్ విషయంలో నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు కానీ బాలన్స్ వర్క్ చాలా ఉండటంతో సాధ్యమవుతుందో లేదోననే అనుమానాలు లేకపోలేదు. సిరుతై శివ దర్శకత్వంలో కోలీవుడ్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందించారు.