ఇళయరాజాకు మాత్రమే దక్కిన గౌరవం

Ilayaraja

మాస్ట్రో ఇళయరాజా కేవలం ఒక పేరు కాదు. మ్యూజిక్ లవర్స్ కి అంతకు మించిన ఎమోషన్. భాషతో సంబంధం లేకుండా తన సంగీతంలో కోట్లాది అభిమానులను ఓలలాడించిన ఘనత ఆయన స్వంతం. దశాబ్దాల తరబడి వెయ్యికి పైగా సినిమాలకు పని చేసినా ఇప్పటికీ అదే నిరాడంబరత చూపించే ఇసైజ్ఞానికి తెలుగులోనూ లక్షలాది ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి లెజెండ్ గురించి బయోపిక్ వస్తే ఫ్యాన్స్ కి అంతకన్నా కావాల్సింది ఏముంటుంది. ఇళయరాజా టైటిల్ పాత్రలో ధనుష్ నటించబోయే ప్యాన్ ఇండియా మూవీ ఇవాళ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా చెన్నైలో ప్రారంభమయ్యింది.

తెలుగు తమిళంతో పాటు అన్ని ప్రధాన లాంగ్వేజెస్ లోనూ ఇళయరాజా రానుంది. ఇప్పటిదాకా ఇండియన్ హిస్టరీ కేవలం ఒక సంగీత దర్శకుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి సినిమా రాలేదు. ఆర్డి బర్మన్, ఎస్డి బర్మన్, లక్ష్మికాంత్ ప్యారేలాల్ తో మొదలుపెట్టి చక్రవర్తి, కెవి మహదేవన్ వరకు ఎవరి కథలు తెరకెక్కలేదు. చనిపోయి స్వర్గం చేరుకున్నాక కూడా ఎవరూ పూనుకోలేదు. కానీ ఇళయరాజా ఉండగానే బయోపిక్ తీయడం అరుదైన గౌరవంగా చెప్పుకోవాలి. క్రికెటర్స్ లో సచిన్, అజహర్, ధోనివి వచ్చాయి కానీ మ్యూజిక్ డైరెక్టర్లది మాత్రం ఇదే మొదలని చెప్పొచ్చు.

దీనికి దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్. జనవరిలో రిలీజైన కెప్టెన్ మిల్లర్ తీసింది ఇతనే. అది నిర్మాణంలో ఉన్నప్పుడు ఇతని పనితనం చూసే ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఒక హార్మొనీ పెట్టె తీసుకుని చెన్నై బ్రిడ్జ్ ల మీద తిరగడంతో మొదలుపెట్టి భారతీరాజాతో స్నేహం, కుటుంబ పోషణ కోసం రేయింబవళ్లు కష్టపడి ఇంత స్థాయికి చేరుకున్న వైనం అన్నీ చూపించబోతున్నారు. స్క్రిప్ట్ చాలా పక్కాగా వచ్చిందట. మాస్ట్రో స్వయంగా సంగీతం సమకూర్చుకోబోతున్నారు. నెవెర్ బిఫోర్ తరహాలో దీని కోసం ప్రత్యేకంగా 1980 నాటి వింటేజ్ మదరాసు సెట్లు వేయబోతున్నారని సమాచారం.