ఫోన్లు మాయం చేసే పనిలో సినిమా వాళ్లు!

మన చేతిలో స్మార్ట్ ఫోన్‍ వుంటే మన ప్రైవేట్‍ లైఫ్‍ ఇంటర్నెట్‍లో పెట్టేసినట్టే అంటూ వుంటారు. మనం ఎక్కడెక్కడ తిరిగిందీ, ఎవరితో ఎంత సేపు మాట్లాడినదీ, ఎవరికి ఏ మెసేజ్‍ పంపించినదీ… మొత్తం ఫోన్‍ మెమరీలో నిక్షిప్తమై వుంటుంది. దానిని డిలీట్‍ చేసేసాం కాబట్టి ఎవరికీ కనిపించదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే డేటా రిట్రీవల్‍ పక్రియలో గతమంతా మళ్లీ తవ్వి తీసేయగలరు. సుషాంత్‍ సింగ్‍ ఆత్మహత్య నేపథ్యంలో అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రియా చక్రవర్తిని విచారించగా వారికి ఆ కేసు పరంగా ఏమీ దొరకలేదు. కానీ ఆమె ఫోన్లో డ్రగ్‍ డీలర్స్తో ముచ్చట్లు, తమతో పని చేసే వారికీ, తనకూ మధ్య డ్రగ్స్ గురించిన చాట్‍ మెసేజ్‍లు బయటపడ్డాయి. దీంతో ఆమె అరెస్ట్ అయిపోయింది.

ఇప్పుడు తన ద్వారా మరింత మంది బాలీవుడ్‍ ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. రియా ఉదంతంతో బాలీవుడ్‍ ఉలిక్కిపడింది. తమ స్మార్ట్ ఫోన్‍ కానీ పోలీసుల చేతికి చిక్కితే ఇక తమ పని శంకరగిరి మాన్యాలే అనే భయం పట్టుకుంది. అందుకే ఫోన్‍ని రీస్టోర్‍ చేయడం కాకుండా పూర్తిగా మాయం చేసేసి, అసలు తమ గతాన్ని తవ్వి తీసే అవకాశం లేకుండా చేసేందుకు చాలా మంది డిజిటల్‍ క్లీనప్‍ మీద పడ్డారట. ఇకపై ఫోన్లలో సందేశాలు పంపించే విషయంలో చాలా అప్రమత్తంగా వుంటారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. రియా దొరికిపోయి మిగతావాళ్లకు లైఫ్‍ లైన్‍ ఇచ్చినట్టయింది. ఆ కృతజ్ఞతతోనే ఏమో ఆమె జైల్‍ నుంచి వచ్చాక తనతో సినిమాలు చేస్తామని చిలక పలుకులు పలుకుతున్నారు కొందరు.