టాలీవుడ్ బంగారాన్ని గట్టిగా పట్టేసుకున్నారు

తెలుగు సినిమాల కోసం అంతర్జాతీయ ఓటిటిలు ఎంతగా పోటీ పడుతున్నాయో చెప్పేందుకు ఉదాహరణలు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ తాము కొనుగోలు చేసిన ప్యాన్ ఇండియా మూవీస్ లిస్టు చూసి ప్రేక్షకులే కాదు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యపోయాయి. పుష్ప 2 ది రూల్, దేవర, విజయ్ దేవరకొండ 12, టిల్లు స్క్వేర్ లాంటి క్రేజీ చిత్రాలను సొంతం చేసుకుని వందల కోట్ల పెట్టుబడిని కుమ్మరించింది. ఇప్పుడు నేనేం తక్కువా అంటూ అమెజాన్ ప్రైమ్ రంగంలోకి దిగి ఇవాళ చేసిన అనౌన్స్ మెంట్లు అభిమానుల్లోనే కాదు సగటు మూవీ లవర్స్ లోనూ హాట్ టాపిక్స్ మారాయి.

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు ‘హరిహర వీరమల్లు’ వీళ్ళ చేతికే వచ్చింది. అనుష్క క్రిష్ కాంబోలో తెరకెక్కబోతున్న ‘ఘాటి’ని అఫీషియల్ గా ప్రకటించారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, నితిన్ ‘తమ్ముడు’, విడి ‘ఫ్యామిలీ స్టార్’, సుహాస్ కీర్తి సురేష్ ల తొలి కాంబో ‘ఉప్పు కప్పురంబు’లతో పాటు ఈ వారమే రిలీజ్ కానున్న ‘ఓం భీమ్ బుష్’ ఈ లిస్టులోనే ఉంది. ఇవి కాకుండా కాంతార 2, సూర్య కంగువాలు సైతం సొంతం చేసుకున్నారు. క్రిష్ రచనలో సూర్య కుమార్ దర్శకత్వం వహించే వెబ్ సిరీస్ ‘అరేబియా కడలి’, సురేష్ బాబు నిర్మాతగా ‘చీకటిలో’ అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

ఇక బాలీవుడ్ లిస్టు చూస్తే చాంతాడంత ఉంది. కానీ సౌత్ తో పోలిస్తే అంత కిక్కిచ్చే పేర్లు కనిపించడం లేదు. దూత 2 ఉంటుందనే ప్రచారానికి చెక్ పెడుతూ అలాంటిదేమి లేదనే సంకేతం ఇచ్చారు. సక్సెస్ అయ్యిందని వేదిక మీదకు చైతు, విక్రమ్ కుమార్ లను పిలిచి థాంక్స్ చెప్పడం తప్పించి సీక్వెల్ సంకేతాలు ఇవ్వలేదు. మొత్తానికి 30కి పైగా సినిమాలు, 15కి పైగా వెబ్ సిరీస్ ల ప్రకటనతో వేడుక హోరెత్తిపోయింది. ఇంత కంటెంట్ రాబోయే రెండు సంవత్సరాల్లోపే మొత్తం వచ్చేస్తుంది. దీన్ని బట్టి ఓటిటి సెగ్మెంట్ భారతదేశంలో ఎంతగా ఎదుగుతోందో అర్థం చేసుకోవచ్చు.