వర్ధమాన హీరో సుహాస్ దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. ముందు షార్ట్ ఫిలింస్ తో మొదలుపెట్టి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి జాతీయ అవార్డు సినిమా కలర్ ఫోటోతో గుర్తింపు తెచ్చుకుని గ్యారెంటీ మార్కెట్ ఉన్న కథానాయకుడిగా ఎదుగుతున్నాడు. గత ఏడాది రైటర్ పద్మభూషణ్ తో సూపర్ హిట్ అందుకుని ఇటీవలే అంబాజీ పేట మ్యారేజీ బ్యాండుతో డీసెంట్ సక్సెస్ అందుకున్న కుర్రాడు త్వరలో ప్రసన్న వదనం, గొర్రె పురాణం, శ్రీరంగనీతులు, ఆనందరావు అడ్వెంచర్స్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. చాలా బిజీ షెడ్యూల్స్ తో డైరీ ఖాళీ లేకుండా ఉంటోంది.
ఇదిలా ఉండగా సుహాస్ కు జోడిగా కీర్తి సురేష్ నటించబోవడం ఖచ్చితంగా విశేషమే. మొన్నటిదాకా నాని, మహేష్ బాబు లాంటి స్టార్ల సరసన ఆడిపాడిన మహానటికి పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న పాత్ర దక్కాలే కానీ వెంటనే ఒప్పేసుకునే సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఉప్పు కప్పురంబు చేస్తోంది. ఇది థియేటర్ మూవీ కాదు. అమెజాన్ ప్రైమ్ ఓటిటి కోసం నిర్మించిన సినిమా. అనిల్ ఐవి శశి దర్శకత్వంలో రాధికా లావు నిర్మాతగా ప్రొడక్షన్ జరుగుతోంది. ఇవాళ జరిగిన ప్రైమ్ ఈవెంట్ లో అఫీషియల్ గా ప్రకటించారు. సుహాస్ హాజరైనా డేట్ల సమస్య వల్ల కీర్తి సురేష్ రాలేదు.
ఒకరకంగా సుహాస్ కి ఇది ప్రమోషన్ లాంటిది. పేరున్న హీరోయిన్లతో యాక్ట్ చేయడం ఖచ్చితంగా ఇమేజ్ ని పెంచుతుంది. పైగా వైవిధమైన కాన్సెప్ట్స్, టైటిల్స్ తో ఆకట్టుకుంటున్న సుహాస్ ఈ రెండేళ్లలో సుమారు ఏడెనిమిది రిలీజులతో పలకరించబోతున్నాడు. మూడు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారటగా అని మొన్న ఒక ప్రెస్ మీట్ లో అడిగిన ప్రశ్నను నవ్వుతు దాటేసిన సుహాస్ డిమాండ్ చూస్తుంటే ఆ ఫిగర్ నిజమైనా ఆశ్చర్యం లేదనిపిస్తుంది. ఇప్పటిదాకా ఇచ్చిన కమిట్ మెంట్లు కాకుండా ఇకపై నెమ్మదిగా వెళ్తానని చెబుతున్న సుహాస్ సబ్జెక్ట్ సెలక్షన్ లో ఆచితూచి అడుగులు వేయనున్నాడు.