వరుణ్ తేజ్ మట్కాకు కొత్త చిక్కు

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మట్కాని భారీ బడ్జెట్ తో తీస్తున్న సంగతి తెలిసిందే. అరవై నుంచి ఎనభై దశకం దాకా భారతదేశంలో మట్కా జూద క్రీడాను తీసుకొచ్చి లక్షలాది జీవితాలను తలకిందులు చేసిన రతన్ కాత్రి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారనే టాక్ ఇప్పటికే బలంగా ఉంది. మేకర్స్ చెప్పకపోయినా స్టోరీ లైన్ ని గమనిస్తే సారూప్యతలైతే కనిపిస్తున్నాయి. వరుణ్ దీని కోసం చాలా కష్టపడి, బరువు పెరగడం తగ్గడం లాంటివి చేసి, మూడు నాలుగు గెటప్స్ లో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. ఇప్పుడు షాక్ విషయానికి వద్దాం.

ఇవాళ అమెజాన్ ప్రైమ్ ఘనంగా చేసిన కంటెంట్ లాంచ్ ఈవెంట్ లో మట్కా కింగ్ వెబ్ సిరీస్ ని ప్రకటించారు. ఎవరి గురించని వివరాలు చెప్పలేదు కానీ రతన్ ఖాత్రిదే అయ్యుండొచ్చని ముంబై మీడియా టాక్. తమన్నా కాబోయే భర్త, ఓటిటి స్టార్ గా మారిన విజయ్ వర్మ టైటిల్ రోల్ పోషించబోతున్నాడు. మరాఠిలో సైరత్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నాగరాజ్ మంజులే దర్శకత్వం వహిస్తాడు. ఇతర క్యాస్టింగ్ వివరాలు వెల్లడి చేయలేదు. తమ సినిమాలు, సిరీస్ లు సెట్స్ మీద ఉన్నప్పుడు గుట్టు మైంటైన్ చేసే ప్రైమ్ వాటి విడుదల తేదీ ప్రకటించే దాకా ఎలాంటి అప్డేట్స్ ఉండవు.

ఒకవేళ వరుణ్ తేజ్ మట్కా కూడా రతన్ స్టోరీనే అయితే పోలికల పరంగా ఇబ్బంది తప్పదు. లేదూ కరుణ కొత్తగా వేరేది చెబుతారంటే సమస్య లేదు. అసలే హీరో దర్శకుడు ఇద్దరూ వరస డిజాస్టర్ల నుంచి కోలుకునేందుకు కష్టపడి పని చేస్తున్నారు. స్క్రిప్ట్ నుంచి మొదలుపెట్టి ప్రొడక్షన్ దాకా ప్రతిదీ మైక్రో లెవెల్ లో చెక్ చేసుకుని మరీ నిర్మాణం చేస్తున్నారు. మధ్యలో బడ్జెట్ వల్ల కొన్ని అవాంతరాలు వచ్చినా తర్వాత సద్దుమణిగాయి. మరి మట్కా కింగ్ ముందు వస్తాడా లేక టాలీవుడ్ మట్కా ఫస్ట్ మార్కెట్ లో దిగుతుందానే దాన్ని బట్టి పరస్పర ప్రభావాలు ఆధారపడి ఉంటాయి.