ప్రతినిధి 2 ఈ అవకాశం వదులుకోవద్దు

పదేళ్ల క్రితం 2014లో విడుదలైన ప్రతినిధి నారా రోహిత్ కెరీర్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. సెన్సిబుల్ టాపిక్ ని తీసుకుని ముఖ్యమంత్రి కిడ్నాప్ ని బ్యాక్ డ్రాప్ గా పెట్టుకుని చేసిన ప్రయోగం కమర్షియల్ గానూ వర్కౌట్ అయ్యింది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ వ్యవస్థను టార్గెట్ చేసిన కౌంటర్లు బాగా పేలాయి. దశాబ్దం తర్వాత ప్రతినిధి 2ని కొన్ని నెలల క్రితం ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీవీ5 మూర్తి దర్శకత్వంలో వర్తమాన పొలిటిక్స్ ని స్పృశిస్తూ ప్లాన్ చేశామని, జనవరి చివరి వారంలో రిలీజ్ చేస్తామని ప్రాజెక్టు ప్రకటించిన టైంలో టీమ్ చెప్పింది. ఆ తర్వాతే సౌండ్ లేదు.

ఈలోగా యాత్ర 2, వ్యూహం, రాజధాని ఫైల్స్ వచ్చాయి. ఏదీ ఆడలేదు. శపథంని డైరెక్ట్ ఏపీ ఫైబర్ నెట్ పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తే ఎన్ని వ్యూస్ వచ్చాయో చెప్పుకోవడానికి కూడా మొహమాటపడుతున్నారు. ఇదే తరహాలో వైఎస్ వివేకా హత్య కేసుని ఆధారంగా చేసుకుని తీసిన వివేకంని వెబ్ సైట్ ద్వారా వంద రూపాయలకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కానీ ఇవన్నీ ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలను లక్ష్యంగా పెట్టుకుని స్వంత అజెండాతో తీసినవి తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. పైపెచ్చు ప్రేక్షకులను కనీస స్థాయిలో ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి.

కానీ ప్రతినిధి 2 కేసు వేరు. ఇది సీరియస్ బ్యాక్ డ్రాప్. నిజ జీవిత పాత్రలను తీసుకుని స్పూఫ్ మేకప్ లు వేయించి వెటకారాలు ఆడటం లాంటివి ఉండవు. సబ్జెక్టు వర్తమాన రాజకీయాలకు సంబంధించినదే అయినా కమర్షియల్ టచ్ తో ప్రశ్నించే రీతిలో ఉంటుంది. ఇది యూనిట్ చెప్పిన మాట. ఏపీ ఎన్నికలకు ఇంకా రెండు నెలల టైం ఉంది. నారా రోహిత్ కనక కాస్త వేగం పెంచి త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా చేస్తే తెలుగుదేశంకు ఏదో మేలు జరుగుతుందని కాదు కానీ ఓటర్లను ఆలోచించే దిశగా ఏమైనా ప్రేరేపిస్తుందేమోనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.