షారుఖ్-అట్లీ.. సంకి

దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు షారుఖ్. కానీ ఈ గ్యాప్‌లో ఒకటికి మూడు సినిమాలు ఓకే చేసుకున్నాడు. అవి మూడూ క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్నవి. ఒకటి బాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం కాగా.. ఇంకోటి ‘వార్’ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ రూపొందించబోయే ‘పఠాన్’. ముందుగా మొదలయ్యే షారుఖ్ చిత్రం ఇదే అంటున్నారు.

కాగా తమిళ దర్శకుడు అట్లీతో షారుఖ్ సినిమా గురించి ఎప్పట్నుంచో చర్చ జరుగుతోంది. అది ఎట్టకేలకు కార్యరూపం దాల్చనున్నట్లు సమాచారం. ఆ సినిమాకు టైటిల్, హీరోయిన్ ఖరారైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ చిత్రానికి ‘సంకి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. సంకి అంటే హిందీలో పిచ్చోడు, కొంచెం తేడాగా ప్రవర్తించే వ్యక్తి అనే అర్థాలున్నాయి.

ఇక ‘సంకి’ సినిమాలో షారుఖ్ ఖాన్ ఫేవరెట్ హీరోయిన్లలో ఒకరైన దీపికా పదుకొనే నటించనుందట. ఇంతకుముందు వీళ్లిద్దరి కలయికలో ‘ఓం శాంతి ఓం’ లాంటి సూపర్ హిట్‌తో పాటు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే మరో సినిమా కూడా వచ్చింది. రెండో సినిమాకు కూడా మంచి వసూళ్లే వచ్చాయి. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత ఈ ఇద్దరూ హ్యాట్రిక్ సినిమాకు రెడీ అయ్యారు. షారుఖ్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కనుందట. కానీ ఈ చిత్రం ఎప్పుడు పట్టాలెక్కుతుందన్నది మాత్రం స్పష్టత లేదు.

అట్లీ మధ్యలో తమిళంలో ఒక సినిమా చేశాక దీని మీదికి వెళ్తాడంటున్నారు. రెండేళ్ల కిందట ‘జీరో’ సినిమాతో చేదు అనుభవం ఎదుర్కొన్న షారుఖ్.. చాలా గ్యాప్ తర్వాత ఈ ఏడాది చివర్లో మళ్లీ కెమెరా ముందుకు వెళ్లనున్నాడు. ‘పఠాన్’ సినిమాతో అతడి రీఎంట్రీ ఉంటుందని అంటున్నారు.