టాలీవుడ్లో ఇప్పుడు ‘గామి’ సినిమానే టాక్ ఆఫ్ ద టౌన్. విద్యాధర్ అనే కొత్త దర్శకుడు ఒక యంగ్ టీంతో కలిసి ఒక యజ్ఞం లాగా ఈ సినిమా తీశాడు. ఏకంగా ఆరేళ్లు టీం ఈ సినిమా కోసం కష్టపడింది. అంతిమంగా సినిమా రిలీజైంది. రెస్పాన్స్ సానుకూలంగానే ఉంది. ప్రేక్షకుల్లో ముందు నుంచే ఈ సినిమా పట్ల పాజిటివ్ ఫీలింగ్ ఉంది.
ఒక కొత్త సినిమా చూడబోతున్న ఆశలు కలిగాయి. పైగా యంగ్ టీం పడ్డ కష్టం తెలుసుకుని ఇలాంటి సినిమాను ప్రోత్సహించాలనుకున్నారు. దీంతో సినిమాకు తొలి రోజు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. తొలి రోజు వచ్చిన ఓపెనింగ్స్ ఎంతో ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. వీకెండ్ సినిమా బలంగా నిలబడేలా కనిపిస్తోంది. మొత్తానికి ఇన్నేళ్ల కష్టానికి కలెక్షన్ల రూపంలోనూ ఫలితం కనిపిస్తే టీంకు అంతకంటే ఆనందం ఇంకేముంటుంది?
ఇక పరిమిత వనరులు, బడ్జెట్‌తో ‘గామి’ టీం తెచ్చిన ఔట్‌పుట్ టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇండస్ట్రీలో ఇప్పుడంతా కథ కంటే కాంబినేషన్లు సెట్ చేయడానికే ప్రాధాన్యం. కథ లేకుండానే పేరున్న హీరో, దర్శకుడిని కలిపి సినిమాలు సెట్ చేస్తుంటారు. స్క్రిప్టు రెడీగా ఉండదు. దాని విషయంలో ఒక కసరత్తు ఉండదు. కొత్తగా ఏదో చేయాలన్న తపన ఉండదు. పేరున్న హీరోలు, దర్శకులకు అయినకాడికి పారితోషకాలు ఇవ్వడం.. కథ మీద వర్క్ చేయకుండా భారీ బడ్జెట్లు పెట్టి సినిమాలు తీయడం.. ఔట్ పుట్ చూస్తే అత్యంత సాధారణంగా ఉండడం.
కానీ ప్రతిభావంతులైన యువ దర్శకులు ఎందరో కొత్త కథలతో, భారీ విజన్‌తో అద్భుతమైన సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నారు. అలా తపనతో సినిమా తీస్తే తక్కువ బడ్జెట్లో కూడా అద్భుతమైన ఔట్ పుట్ రాబట్టవచ్చనడానికి సంక్రాంతి సినిమా ‘హనుమాన్’ పెద్ద ఉదాహరణగా నిలిస్తే.. తాజాగా ‘గామి’ కూడా మరో బెస్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తోంది. కాబట్టి నిర్మాతలు కాంబినేషన్ క్రేజ్‌తో చేతులు కాల్చుకోవడం కంటే.. ప్రతిభావంతులైన యువ దర్శకులు, టెక్నీషియన్లను నమ్ముకోవడం ఎంతో మంచిది. ఈ కోణంలో ‘గామి’ టీం మీద దృష్టిపెట్టి దర్శకుడు విద్యాధర్ కగితతో పాటు మిగతా టెక్నీషియన్లు, ఆర్టిస్టులకు అవకాశాలిచ్చి ప్రోత్సహించడం నిర్మాతలకే మంచిది.