ప్రేమలు ఎలా ఉందంటే

కేరళలో గొప్ప విజయం అందుకున్న ప్రేమలు తెలుగులో అదే టైటిల్ తో నిన్న విడుదలైంది. గామి, భీమా హడావిడిలో ప్రేక్షకులు మూడో ఆప్షన్ గా పెట్టుకున్నారు కానీ యూత్ కి దీని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. మలయాళం వెర్షన్ ని సబ్ టైటిల్స్ సహాయంతో చూసినవాళ్లు ఇది డబ్బింగ్ లోనూ అంతే సంచలనం సృష్టిస్తుందని అంచనా వేశారు. అయితే ఓపెనింగ్స్ మాత్రం మెల్లగా మొదలయ్యాయి. నగరాలు మినహాయించి మిగిలిన చోట వసూళ్లు స్లోగా పెరుగుతున్నాయి. ఎస్ఎస్ కార్తికేయ అనువాద బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకీ ప్రేమలు ఎలా ఉందో చూద్దాం.

ఇంజనీరింగ్ చదివిన సచిన్(నాస్లెన్) కు కాలేజీ వయసులోనే ధైర్యం చాలక లవ్ స్టోరీని విఫలం చేసుకుంటాడు. ఉద్యోగం కోసం యుకె వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. యావరేజ్ స్టూడెంట్ అయిన సచిన్ గేట్ శిక్షణ కోసం హైదరాబాద్ వస్తాడు. ఒక ఫంక్షన్ లో రీనూ (మమిత బైజు) ని చూసి ఇష్టపడతాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అప్పుడే జీవితం మొదలుపెట్టిన రీనూకి సచిన్ తో స్నేహం కుదురుతుంది. అక్కడి నుంచి వీళ్ళ ప్రయాణం ఎలా జరిగిందనేది అసలు కథ. స్టోరీ పరంగా చూసుకుంటే ఇందులో కొత్తదనం లేదు. మేజిక్ అంతా దర్శకుడు ఏడి గిరీష్ ఇచ్చిన ట్రీట్ మెంట్ లో ఉంది.

యువతను ఆకట్టుకునే హాస్యం, ట్రెండ్స్ ని పసిగట్టి వాటి ద్వారా కామెడీని జొప్పించి విధానం, సహజమైన పాత్రలు, అంతకంటే న్యాచురల్ గా ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ అన్నీ పోటీపడటంతో ప్రేమలు నిక్షేపంగా కాలక్షేపం చేయిస్తుంది. అయితే ఈ జానర్ మీద ఆసక్తి లేని మాస్ ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు కానీ కుర్రకారు మాత్రం ఎంజాయ్ చేయడానికి లోటు లేకుండా ప్రేమలులో అన్నీ కుదిరాయి. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ కావడంతో నేటివిటీ సమస్య రాలేదు. ఆదిత్య హాసన్ రచన బాగా కుదిరింది. టెన్షన్ లేకుండా సరదాగా టైం పాస్ కావాలంటే ప్రేమలు నిరాశ పరిచే ఛాన్స్ ఇవ్వదు.