రామాయణానికి రంగం సిద్ధమవుతోంది

బాలీవుడ్ లోనే కాదు ఇండియాలోనే గొప్ప దృశ్యకావ్యంగా తీయాలని సంకల్పించుకున్న దర్శకుడు నితీష్ తివారి దానికి తగ్గట్టే భారీ ఏర్పాట్లతో వచ్చే నెల ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాముడిగా రన్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి కన్ఫర్మ్ అయిన క్యాస్టింగ్ లో ఉండగా రావణుడిగా యష్ ఒప్పుకున్నాడనే టాక్ నార్త్ మీడియాలో బలంగా వినిపిస్తోంది. బెంగళూరు వర్గాలు మాత్రం ధృవీకరించడం లేదు. ఇదిలా ఉండగా వచ్చే నెల ఏప్రిల్ 17న రామాయణంని లాంచ్ చేసేందుకు రంగం సిద్ధమైనట్టుగా తెలిసింది. కొన్ని కీలక వివరాలు చూద్దాం.

రామాయణం మొత్తం మూడు భాగాల్లో తీస్తారు. ఫస్ట్ పార్ట్ లో అయోధ్య పరిచయం, రాముడి ఎంట్రీ, సీత స్వయంవరం, వనవాసంతో మొదలుపెట్టి అడవిలో ఒంటరిగా ఉన్న సీతను రావణుడు అపహరించే దాకా ఉంటుందట. అంటే హనుమంతుడి ప్రవేశం రామాయణం 2లో చూడాలి. ఎంత డిటైల్డ్ గా చూపించినా సినిమాటిక్ ఫ్లేవర్ మిస్ కాకుండా విజువల్ ఎఫెక్ట్స్ తో ఇప్పటి తరం గొప్పగా అనుభూతి చెందేలా స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని సమాచారం. సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ యాక్టర్లను తీసుకోవడానికి కారణం ఇదే. బడ్జెట్ మాత్రం బయటికి చెప్పడం లేదు.

విడుదల ఇంకో ఏడాది అంటే 2025 కంటే ముందు ఉండే ఛాన్స్ లేదు. మొత్తం సిరీస్ వచ్చేనాటికి కనీసం నాలుగేళ్లు పట్టొచ్చని అంటున్నారు. రామాలయ ప్రారంభోత్సవం జరిగిన వేళ ఇంతకన్నా గొప్ప సందర్భం ఈ సినిమాకు రాదని నిర్మాతల భావన. ఓపెనింగ్ కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పిలిచే ఆలోచన జరుగుతోంది కానీ ఎన్నికల సమయంలో ప్రధాని డేట్ దొరకడం అంత సులభం కాదు. కానీ రాముడికి సంబంధించిన సినిమా కాబట్టి నో అనకపోవచ్చు. యానిమల్ లో వైల్డ్ యాంగిల్ బయటికి తీసిన రన్బీర్ కపూర్ ఈసారి రఘురాముడిగా సౌమ్యత్వం ఎలా చూపిస్తాడో మరి.