గత నెల విడుదలై ఆల్ టైం డిజాస్టర్స్ లో చోటు దక్కించుకున్న లాల్ సలామ్ విషయంలో అందరి వేళ్ళు దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ మీదకే వెళ్లాయి. సూపర్ స్టార్ తండ్రి ని చేతులారా వృథా చేసుకుందని విమర్శకులు విరుచుకు పడ్డారు. మొదటి రోజు మార్నింగ్ షోకే ఫలితం తేలిపోవడంతో ఆవిడ బయట కనిపించనే లేదు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తప్పు ఒప్పేసుకుంది. ముందు అనుకున్న కథ వేరని, మొయినుద్దీన్ పాత్రని పది నిమిషాలకు రాసుకుని కథను తయారు చేసుకుంటే రజనీకాంత్ ఒప్పుకున్నాక స్వరూపమే మారిపోయిందని అన్నారు.
ఐశ్యర్య చెప్పిన వెర్షన్ ఇలా ఉంది. లాల్ సలామ్ ఫస్ట్ వెర్షన్ లో ఇంటర్వెల్ తర్వాతే మొయినుద్దీన్ క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. అప్పటిదాకా ఊళ్ళో పాత్రల ఎమోషన్లు, క్రికెట్ కు సంబంధించిన డ్రామా వగైరాలతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. అయితే లెన్త్ ఎక్కువైనా పర్వాలేదనే రీతిలో రజని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఒక్కసారిగా స్క్రీన్ ప్లే మారిపోయింది. అవసరం లేకపోయినా తలైవర్ కి బిల్డప్ ఇంట్రో, ఫైట్ పెట్టాల్సి వచ్చింది. అదనంగా సీన్లు రాశారు. దీని వల్ల విక్రాంత్ స్పేస్ తగ్గిపోయి విష్ణు విశాల్ పాత్రకు సరైన తీరు తెన్నూ లేకుండా పోయాయి. ఇదంతా కన్ఫ్యూజన్ కి దారి తీసింది.
రిలీజ్ కు రెండు రోజుల ముందు వరకు ఎడిటింగ్ లో చోటు చేసుకున్న గందరగోళం వల్ల ఫైనల్ అవుట్ ఫుట్ ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునే అవకాశం లేకపోయింది. క్రిటిక్స్ ఎంచిన లోపాలన్నీ సబబేనని అంగీకరించింది. ఏది ఏమైనా జరిగిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం వల్ల లాభం లేదు కానీ మరోసారి పొరపాట్లకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడేందుకు ఛాన్స్ ఉంటుంది. లాల్ సలాం ఒక్క ఐశ్వర్యకే కాదు లైకా సంస్థకు, రజనికి, ఆర్టిస్టులు అందరికీ పీడకలగా నిలిచిపోయింది. అన్నట్టు తలైవర్ తనయ సౌరవ్ గంగూలీ బయోపిక్ తీసే ఆలోచనలో ఉన్నారని చెన్నై టాక్.