గామి టీం అంత కష్టపడింది

గామి.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న కొత్త సినిమా. ఒక సినిమా కోసం ఆర్నెల్లు కష్టపడతారు. సంవత్సరం కష్టపడతారు. రెండేళ్లు కష్టపడతారు. కానీ ‘గామి’ టీం మాత్రం ఏకంగా ఆరేళ్లు శ్రమించింది. ప్రి ప్రొడక్షన్ నుంచి సినిమా పూర్తయ్యే వరకు టీం ఎంత కష్టపడిందో ఈ సినిమా ప్రోమోల్లో, మేకింగ్ వీడియోల్లో స్పష్టంగా కనిపించింది.

క్రౌడ్ ఫండింగ్‌తో మొదలైనప్పటికీ.. ఈ సినిమా క్వాలిటీ, మేకింగ్ విషయంలో టీం అస్సలు రాజీ పడలేదు. అనేక భారీ సెట్స్ వేశారు. అలాగే కాశీ, హిమాలయాలు లాంటి ప్రాంతాల్లో ఎంతో కష్టపడి చిత్రీకరించారు. ఈ సినిమా షూట్ టైంలో అసలు బతికి బయటపడతామా అనే సందేహం కూడా కలిగిందంటూ హీరోయిన్ చాందిని చౌదరి మీడియా ఇంటర్వ్యూల్లో తమ కష్టాన్ని వివరించింది.

“నా కెరీర్లో ఏ చిత్రానికీ ఇంతగా కష్టపడలేదు. ఈ సినిమా చిత్రీకరణ ఒక సాహస యాత్రలా సాగింది. వారణాసి, కశ్మీర్, హిమాలయాలు.. ఇలా సవాలుతో కూడిన ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ముఖ్యంగా హిమాలయాల్లో షూటింగ్ అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో సాగింది. మా టీం మొత్తంలో నేనొక్కదాన్నే అమ్మాయిని. అందరం ఒకే బస్సులో హిమాలయాల్లోకి వెళ్లి సూర్యాస్తమయం వరకు షూట్ చేసేవాళ్లం. అక్కడ వాష్ రూమ్స్ లాంటివి ఉండవు. కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగేదాన్ని కాదు. అలా నెల రోజులు షూట్లో పాల్గొన్నా. గడ్డ కట్టిన ఓ నదిపై షూట్ చేస్తున్నపుడు మంచు ఫలకాల మధ్య పగుళ్లు వచ్చి నదిలో పడిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు చేతిలో ఉన్న లగేజ్ అంతా దూరంగా పడేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి దూకా. ఇలా షూటింగ్ ఆద్యంతం ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొన్నాం. నాకు తెలిసి తెలుగులో ‘గామి’ లాంటి సినిమా రాలేదు. ఇది సక్సెస్ అయితే ఇలాంటి మంచి ప్రయత్నాలు మరిన్ని జరుగుతాయి” అని చాందిని చెప్పింది.