రావు రమేష్ మెగా లక్ష్యం నెరవేరింది

విలక్షణ నటుడు రావుగోపాల్ రావు కాంబినేషన్ లో చిరంజీవి ఎన్ని సినిమాలు చేశారో లెక్క చెప్పడం కష్టం. ఖైదీతో మొదలుకుని గ్యాంగ్ లీడర్ వరకు వీళ్ళ కలయికలో ఎన్నో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. వ్యక్తిగతంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. సుమారు పదేళ్ల పాటు ఈ కాంబో తెరను ఏలిందంటే ఆశ్చర్యం ఏమి లేదు. అలాంటి రావు గారి వారసుడు రావు రమేష్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్ళు దాటేసింది. ఎన్నో చిత్రాల్లో ప్రతినాయకుడిగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా బోలెడు వేషాలు దక్కించుకున్నారు. కొత్త బంగారు లోకం నుంచి కెజిఎఫ్ దాకా ఈ కౌంట్ చాలా పెద్దది. అయినా ఒక వెలితి ఉండిపోయింది.

అదే నాన్నకు తెరమీద సవాల్ విసిరిన చిరంజీవికి విలన్ గా నటించడమనే కోరిక. విశ్వంభరతో అది తీరనుందని లేటెస్ట్ అప్ డేట్. పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాతో నటించవా అని మెగాస్టార్ స్టేజి మీదే రావు రమేష్ ని అడగటం అభిమానులకు గుర్తే. తర్వాత గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ వచ్చాయి కానీ దేనిలోనూ సాధ్యపడలేదు. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న విశ్వంభరలో గాల్లో తిరిగే ఒక విచిత్ర మాంత్రికుడి తరహా పాత్రలో దర్శకుడు విశిష్ట చాలా స్పెషల్ గా దాన్ని డిజైన్ చేశారట. మెయిన్ విలన్లలో ఒకరిగా ప్రత్యేకంగా ఉంటుందని వినికిడి.

బాగా లేట్ అయ్యింది కానీ రావు రమేష్ మెగా లక్ష్యం ఇన్నేళ్లకు నెరవేరినట్టే. ఈయన ఉన్న విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ లీకైన వర్గాల ప్రకారం అనుమాన పడేందుకు లేదు. 2025 జనవరి 10 విడుదల ప్లాన్ చేసుకున్న విశ్వంభర షూటింగ్ ఏకధాటిగా చేస్తున్నారు. హీరోయిన్ త్రిషతో పాటు చెల్లెల్లుగా నటిస్తున్న ఇతర ఆర్టిస్టులతో ఒక పాట, కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజ్ ఇలా అందరి సినిమాల్లోనూ కనిపించిన రావు రమేష్ ఫైనల్ గా చిరు మూవీలో ఫుల్ లెన్త్ దర్శనమివ్వడం స్పెషలే.