కాగల కార్యం ఎవరో తీర్చినట్టు సలార్ పార్ట్ 2 శౌర్యంగ పర్వం ఆలస్యమవుతుందేమో అని టెన్షన్ పడినవాళ్లకు త్వరలోనే శుభవార్త వచ్చేలా ఉంది. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ తో కొత్త సినిమా మొదలుపెట్టాలి. దేవర కనక ఏప్రిల్ 5 రిలీజయ్యుంటే ఇది సాధ్యమయ్యేది. కానీ జరిగింది వేరు. తారక్ ఆ డేట్ వదులుకున్నాడు. ఏకంగా అక్టోబర్ 10కి వెళ్ళిపోయాడు. ఇంకా షూటింగ్ బాలన్స్ తో పాటల చిత్రీకరణ పెండింగ్ ఉంది. సో ఇప్పుడప్పుడే ఫ్రీ కావడం జరిగే పనిలా లేదు.
ఇది కాగానే హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2లో అడుగు పెట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ దానికి సంబంధించిన షెడ్యూలింగ్ జరిగిపోయింది. వచ్చే ఏడాది ఆగస్ట్ విడుదల లాక్ చేసుకున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే మార్చలేని విధంగా ప్లానింగ్ జరిగిపోయింది. అప్పటిదాకా ప్రశాంత్ నీల్ ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. సలార్ 2 స్క్రిప్ట్ సిద్ధంగా ఉందట. ఎలాగూ మొదటి భాగంకి వేసిన సెట్లు, ప్రాపర్టీలు అలాగే ఉన్నాయి కాబట్టి ఇప్పుడే ముగించేస్తే అనుకూలంగా ఉంటుందని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం. నటుడు బాబీ సింహా ఏప్రిల్ లో షూట్ ఉంటుందని చెప్పిన మాట బలం చేకూరుస్తోంది.
ఏదైతేనేం సలార్ 2కి రూట్ క్లియర్ అవుతోంది. కల్కి 2898 ఏడికి సంబంధించిన పనులు, ప్రమోషన్లు అన్నీ మే 9 లోపు పూర్తవుతాయి. ఆ తర్వాత ది రాజా సాబ్ తో పాటు సలార్ 2కి డేట్లు ఇచ్చేందుకు ప్రభాస్ కు అనుకూలంగా ఉంటుంది. స్పిరిట్ కు ఇంకా టైం ఉంది కాబట్టి తొందరేమీ లేదు. హను రాఘవపూడి ప్రాజెక్టు కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. సో అన్ని కోణాల్లో చూసుకున్నా సలార్ 2 జాప్యం జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్లానింగ్ ప్రకారం మొత్తం సవ్యంగా జరిగిపోతే 2025లోనే శౌర్యంగ పర్వం చూసుకోవచ్చు