తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న తమిళ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి లాంటి చిత్రాల్లో ఆమె చేసిన నెగెటివ్ రోల్స్ బాగా క్లిక్ కావడంతో ఆమె ఇక్కడ ఫుల్ బిజీ అయిపోయింది. తమిళంలో కూడా రానన్ని అవకాశాలు తెలుగులో వస్తున్నాయి. ఇటీవలే హనుమాన్‌తో మరో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న వరలక్ష్మికి కొన్నేళ్ల వరకు తీరిక లేదు.
ఐతే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక కీలకమైన అప్‌డేట్ బయటికి వచ్చింది. వరలక్ష్మి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఆర్ట్ గ్యాలరీ బిజినెస్ మ్యాన్ నికోలీ సచ్‌దేవ్‌తో ఆమె ఎంగేజ్మెంట్ జరిగింది. కుటుంబ సభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. వరలక్ష్మి పెళ్లి గురించి ఈ మధ్య ఎలాంటి గుసగుసలు వినిపించలేదు. నేరుగా ఎంగేజ్మెంట్‌తో ఆమె అందరికీ పెద్ద షాకే ఇచ్చింది.
శరత్ కుమార్ మొదటి భార్య సంతానమైన వరలక్ష్మి చాలా ఏళ్ల కిందటే పెళ్లి చేసుకుంటుందని వార్తలు వచ్చాయి. తెలుగువాడైన తమిళ నటుడు విశాల్‌తో ఆమె కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉంది. ఒక దశలో వీరి పెళ్లే తరువాయి అని వార్తలు వచ్చాయి. కానీ తర్వాత వీరి మధ్య గ్యాప్ వచ్చింది. అందుక్కారణం నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్‌కుమార్‌తో విశాల్ తలపడడమే కావచ్చు.
విశాల్‌తో బ్రేకప్ అయ్యాక వరలక్ష్మి పెళ్లి ఊసే ఎత్తలేదు. పూర్తిగా నటనలో బిజీ అయిపోయింది. ఇప్పుడు బహు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సమయంలో ఆమె పెళ్లి ఫిక్సయింది. త్వరలోనే ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి చెన్నైలో ఘనంగానే నిర్వహించాలని శరత్ కుమార్ భావిస్తున్నారట. ప్రస్తుతం వరలక్ష్మి.. శబరి, రాయన్ తదితర చిత్రాల్లో నటిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates