జై హనుమాన్.. లుక్ రెడీ అవుతోంది


హనుమాన్.. తెలుగు సినిమా చరిత్రలోనే అతి పెద్ద సంచలనాల్లో ఒకటనదగ్గ సినిమా. మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్ లాంటి టాప్ స్టార్ల సినిమాలతో పాటుగా రిలీజై.. ఆ మూడు సినిమాలు కలిపి సాధించిన వసూళ్ల కంటే ఎక్కువ కలెక్ట్ చేయడం.. సంక్రాంతి చరిత్రలోనే అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత పెద్ద సినిమా అయినా.. ఎంత మంచి టాక్ తెచ్చుకున్నా.. మూడు వారాలకు మించి థియేటర్లలో నిలవలేకపోతున్న ఈ రోజుల్లో.. వందకు పైగా థియేటర్లలో 50 రోజులు ఆడటం అంటే ఆషామాషీ విషయం కాదు.

ఇప్పటికీ కొత్త సినిమాలకు దీటుగా ఆ చిత్రానికి వసూళ్లు వస్తూనే ఉన్నాయి. 50 రోజుల ప్రదర్శన పూర్తయిన సందర్భంగా హనుమాన్ టీం గ్రాం‌డ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేసింది. అందులో హనుమాన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

‘హనుమాన్’కు కొనసాగింపుగా రానున్న ‘జై హనుమాన్’కు సంబంధించి అతి త్వరలో ఫస్ట్ లుక్ లాంచ్ చేయబోతున్నట్లు ప్రశాంత్ వెల్లడించాడు. ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులను కొన్ని రోజుల కిందటే అధికారికంగా మొదలుపెట్టాడు ‘జై హనుమాన్’లో హనుమంతుడి పాత్రను ఒక స్టార్ హీరో పోషిస్తాడని ప్రశాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. మరి ఫస్ట్ లుక్‌లో ఆ హీరో ఎవరో వెల్లడిస్తారా అని అడిగితే.. హనుమంతులవారి ఫస్ట్ లుక్కే రిలీజ్ చేస్తామంటూ నర్మగర్భమైన సమాధానం ఇచ్చాడు ప్రశాంత్.

‘హనుమాన్’ క్లైమాక్స్‌లో హనుమంతుడి చుట్టూ తిరిగే సన్నివేశాలు చూసి ప్రేక్షకులు ఎంతగానో ఆస్వాదించారని.. అలాంటి సన్నివేశాలు ‘జై హనుమాన్’ అంతటా ఉంటాయని.. ఈ సినిమాకు ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతను ‘జై హనుమాన్’ను ఇంకా బాగా తీయడం ద్వారా తీర్చుుకంటానని ప్రశాంత్ చెప్పడం విశేషం.