ప్రమాదాలుగా మారుతున్న వరుణ్ ప్రయోగాలు

గంపెడాశలతో దేశం మొత్తం ప్రమోషన్ చేసిన వరుణ్ తేజ్ కు ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫలితం ఎంత మాత్రం సంతోషం కలిగించే దిశగా వెళ్లడం లేదు. ఓపెనింగ్స్ లోనే ఈ విషయం తేటతెల్లమైపోగా పబ్లిక్ టాక్, రివ్యూలు ఆశాజనకంగా లేకపోవడంతో హిందీ, తెలుగు రెండు చోట్ల ప్రయాణం భారంగా జరగనుంది. నిజానికీ మెగా హీరో కమర్షియల్ ఫార్ములాలకు దూరంగా కొత్త తరహా ప్రయోగాలు చేద్దామని ప్రమాదాల బారిన పడుతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల మార్కెట్ డౌన్ కావడమే కాకుండా క్రమంగా మాస్ కి దూరమయ్యే రిస్క్ ఏర్పడుతుంది. ఇది డేంజర్ బెల్ లాంటిది.

గత ఏడాది ‘గాండీవధారి అర్జున’కూ ఇలాగే జరగడం ఫ్యాన్స్ మర్చిపోలేదు. నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా అందులోనూ టిపికల్ పాత్ర చేసినా ప్రయోజనం దక్కలేదు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు సినిమా మొత్తం విదేశాల్లో చుట్టేయడం స్వదేశంలో తిరస్కారానికి దారి తీసింది. అంతకు అంతకుముందు ‘గని’లో లక్ష్యం కోసం కష్టపడే బాక్సర్ గా చేసిన క్యారెక్టర్ దారుణమైన డిజాస్టర్ ని చేతిలో పెట్టింది. ఉపేంద్ర లాంటి సీనియర్ హీరో స్పెషల్ రోల్ సైతం ఉపయోగపడలేదు. దీని దెబ్బ ఎంత గట్టిదంటే స్వంతంగా ప్రొడక్షన్ మొదలుపెట్టిన అల్లు అర్జున్ అన్నయ్య బాబీ తిరిగి ఇంకో సినిమా చేయలేనంతగా.

ఇవన్నీ వరుణ్ తేజ్ విశ్లేషించుకోవాలి. ఎఫ్2, ఎఫ్3, ఫిదా, తొలిప్రేమ, గద్దలకొండ గణేష్ ఎందుకు సక్సెస్ అయ్యాయో గుర్తించాలి. తన నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వాలి తప్పించి తాను పర్సనల్ గా ఇష్టపడినవి చేసుకుంటూ పోవడం కాదు. రవితేజ లాంటి స్టార్లు ఎక్స్ పరిమెంట్లు చేయొచ్చు. కెరీర్ ఉచ్చ దశ ఎప్పుడో చూశారు కానీ ఇప్పుడొచ్చే ఫలితాలు పెద్దగా ప్రభావం చూపించవు. కానీ వరుణ్ కేసు అది కాదు. ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. చాలా భవిష్యత్తు ఉంది. మెగా ప్రిన్స్ అనడమే తప్పించి ఇంకా స్టార్ ట్యాగే రాలేదు. అలాంటప్పుడు ఇకపై వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా ఉండాలి.