వరుణ్ తేజ్ కొండంత ఆశలు పెట్టుకున్న ఆపరేషన్ వాలెంటైన్ ఇంకో నలభై ఎనిమిది గంటల లోపే రిలీజ్ కు రెడీ అవుతోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోని సంస్థ భాగస్వామ్యంలో నిర్మించిన ఈ భారీ చిత్రం ద్వారా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయమవుతోంది. మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి అతిథిగా రావడంతో హైప్ ఇంకాస్త పెరిగింది. రెండు వారాలుగా వరుణ్ దీని ప్రమోషనే ప్రపంచంగా తిరుగుతున్నాడు. ట్రైలర్ చూశాక అంచనాలు పెరిగాయి కానీ బుకింగ్స్ ఇంకా ఊపందుకోవాలి. పబ్లిక్ టాక్ తో పాటు రివ్యూలు కీలకం కాబోతున్నాయి.
అసలు వాలెంటైన్ చేసిన మంచి పని సంగతికొస్తే ఇంత భారీ బడ్జెట్ పెట్టినా సరే ప్యాన్ ఇండియా జోలికి వెళ్లకుండా కేవలం హిందీ, తెలుగులో మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించుకోవడం. మాములుగా తమిళ, మలయాళం, కన్నడ కూడా చేయాలి. కానీ నిర్మాతలు వద్దనుకున్నారు. డబ్బింగ్ ఖర్చులే కదా ఏముందిలే అనుకోలేదు. కంటెంట్ లోని ఒరిజినల్ ఫీల్ ప్రేక్షకులకు చేరాలంటే అనువాదం చేయకూడదని డిసైడ్ చేసుకుని దానికే కట్టుబడ్డారు. గత నెల ఇదే బ్యాక్ డ్రాప్ లో వచ్చిన హృతిక్ రోషన్ ఫైటర్ సైతం డబ్బింగ్ జోలికి వెళ్లకుండా ఓన్లీ బాలీవుడ్ అనేశారు.
మార్కెట్ కోణంలో చూసుకుంటే అన్ని భాషల్లో సినిమా వదిలి వాటి డిస్ట్రిబ్యూషన్, పబ్లిసిటీ వ్యవహారాల మీద బుర్ర చెడగొట్టుకోవడం కన్నా లాభమో నష్టమో ఇలా రెండు లాంగ్వేజెస్ కు కట్టుబడటం మంచిదే. పైగా వరుణ్ కి బయట రాష్ట్రాల్లో ఇమేజ్ లేదు. ఆపరేషన్ వాలెంటైన్ బ్లాక్ బస్టర్ అయితే అప్పుడు తనకొచ్చే గుర్తింపు నెక్స్ట్ చేయబోయే సినిమాల బిజినెస్ కు ఉపయోగపడుతుంది. అప్పుడు కావాలంటే చెన్నై, బెంగళూరు వెళ్లి మరీ మీడియాని కలుసుకోవచ్చు. ముందు రోజు ప్రీమియర్ల లాంటి రిస్కులకు వెళ్లకుండా మార్చి 1 నుంచే ఆపరేషన్ వాలెంటైన్ థియేటర్లలో రాబోతున్నాడు.