ఇష్టమైన అడ్డాలో మహేష్ బాబు మల్టీప్లెక్స్

హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ కు మహేష్ బాబుకి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. ఎన్నో బ్లాక్ బస్టర్లు అక్కడ సిల్వర్ జూబిలీ ఆడి రికార్డులు నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా సుదర్శన్ 35 ఎంఎంని తమ కోటగా భావిస్తారు ఫ్యాన్స్. అలాంటి చోట మహేష్ ఏకంగా ఒక మల్టీప్లెక్స్ కడితే ఎలా ఉంటుంది. అదే నిజం కాబోతోంది. గచ్చిబౌలిలో ఏఎంబి సూపర్ ప్లెక్స్ తర్వాత దాన్ని మించిన మరో సముదాయం గతంలో సుదర్శన్ 70 ఎంఎం థియేటర్ ఉన్న స్థానంలో ముస్తాబు కాబోతోంది. మొత్తం 7 స్క్రీన్లతో దీనికి ఎఎంబి క్లాసిక్ అని నామకరణం చేస్తున్నారు. ఏషియన్ భాగస్వామ్యంలో ఉంటుంది.

దీనికి తాలూకు ఫోటో అభిమానుల మధ్య వైరలవుతోంది. గతంలో వెంకటేష్ పార్ట్ నర్ గా ఇది నిర్మిస్తారనే ప్రచారం జరిగింది కానీ దానికి భిన్నంగా ఇది మహేష్ చేతుల్లోకి రావడం విశేషం. సింగల్ స్క్రీన్లకు నెలవుగా ఉండే క్రాస్ రోడ్స్ లో ఇది మొదటి మల్టీప్లెక్స్. కొత్త రిలీజులు ఎవరైనా సరే ఇక్కడ మొదటి రోజు చూడటం రివాజుగా పెట్టుకున్నవాళ్ళు లక్షల్లో ఉంటారు. ఒకవేళ ఫస్ట్ డే మిస్ అయినా తర్వాతి రోజుల్లో అయినా సరే ఇక్కడ చూస్తే తప్ప సంతృప్తి చెందని మూవీ లవర్స్ కు కొదవే లేదు. అలాంటిది ఖరీదైన సముదాయం వస్తే ఎలా అని ప్రేక్షకులు టెన్షన్ పడనక్కర్లేదు.

ఉన్నవాటిని తీసేసే ఆలోచనేదీ లేదట. కాకపోతే మల్టీప్లెక్సుల ప్రభావం ఖచ్చితంగా సింగల్ స్క్రీన్ల మీద ఉండకపోదు. స్థానికులు మాత్రం తమకు ఉపాధి వ్యాపార అవకాశాలు పెరుగుతాయని సంబరపడుతుండగా, ఇప్పటికీ ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉన్న నారాయణగూడ మరింత బిజీ జంక్షన్ గా మారడం ఖాయం. ప్రస్తుతం శాంతి, సప్తగిరి, సుదర్శన్ 35, సంధ్య 70, సంధ్య 35, దేవి 70, తారకరామ, శ్రీ మయూరి ఈ ప్రాంతంలో ఉన్నాయి. రికార్డుల పరంగా మైలురాళ్ళు నమోదు చేసే క్రాస్ రోడ్స్ లో ఇకపై మల్టీప్లెక్సులకు సంబంధించి కూడా కొత్త బెంచ్ మార్క్ నమోదు కానుంది.