సైలెంటుగా హిట్టు కొట్టిన ఆర్టికల్ 370

డంకీ తర్వాత బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ పెద్ద హీరో సినిమా ఏదీ రాలేదు. నెగటివ్ రివ్యూలు వచ్చినా సరే ఉన్నంతలో షాహిద్ కపూర్ తేరి బాతోమే ఐసా ఉల్జా జియా డీసెంట్ వసూళ్లతో బయ్యర్లకు ఊపిరినిచ్చింది. అయితే ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని ఆర్టికల్ 370 అనూహ్య విజయం దిశగా దూసుకుపోవడం ఎవరూ ఊహించనిది. గల్ఫ్ దేశాల్లో నిషేధానికి గురైన ఈ పొలిటికల్ డ్రామా మొన్న శుక్రవారం థియేటర్లలో అడుగు పెట్టింది. 99 రూపాయల మల్టీప్లెక్సుల వన్ డే ఆఫర్ ని బ్రహ్మాండంగా వాడుకుని భారీ ఓపెనింగ్ తెచ్చుకుంది. అంతగా ఈ మూవీలో ఏముందో చూద్దాం.

ఇంటెలిజెంట్ ఏజెంట్ జూని అక్సర్(యామీ గౌతమ్), పీఎం ఆఫీస్ కీలక పదవిలో ఉండే స్వామినాథన్(ప్రియమణి)లది జమ్మూ కాశ్మీర్ విషయంలో ఒకే భావజాలం. ప్రధాన మంత్రి(అరుణ్ గోవిల్)మద్దతు వీళ్లకు ఉంటుంది. ప్రమాదరకమైన తీవ్రవాదిని పట్టుకున్న కేసులో జూనికి గొప్ప గుర్తింపు రాకపోయినా ఎన్ఐఏలో భాగమవుతుంది. ఆర్టికల్ 370కు సంబంధించిన చర్యలు ప్రభుత్వం వైపు నుంచి మొదలయ్యాక జూనీ, స్వామినాథన్ ల పాత్ర కీలకంగా మారుతుంది. తీవ్ర రాజకీయ పరిణామాలు, సామాజిక అలజడులు తలెత్తుతాయి. చివరికి ఏం జరిగిందనేది అసలు కథ.

దర్శకుడు ఆదిత్య సుభాష్ జంభలే బీజీపీ అమలుచేసిన ఆర్టికల్ 370 ఉద్దేశాన్ని పూర్తి సానుకూల దృక్పథంతో చూపించే ప్రయత్నం చేశాడు. ఎజెండా వన్ సైడే అయినప్పటికీ కథా కథనాలను గతం ప్లస్ వర్తమాన సంఘటనలను ముడిపెట్టి చెప్పిన వైనం ఆకట్టుకునేలా సాగింది. దానికి తోడు చక్కని ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ తోడవ్వడంతో విసుగు రాకుండా చేసింది. అయితే ఈ సబ్జెక్టు మీద ఆసక్తి ఉన్నవాళ్ళకే ఆర్టికల్ 370 ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. విరుద్ధ అభిప్రాయాలు ఉంటే మాత్రం తేడాగా అనిపించినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి బాక్సాఫీస్ హిట్టు వైపే ఈ సినిమా పరుగులు పెడుతోంది.