అనుపమకు వినిపించని ‘సైరన్’ మోత

శతమానం భవతి టైంలో టాలీవుడ్ లో బాగానే కనిపించిన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత గ్యాప్ తీసుకుంది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా డిమాండ్ అయితే పెరగలేదు. కార్తికేయ 2 హిట్టు కొట్టినా, 18 పేజస్ యావరేజ్ అనిపించుకున్నా వాటి వల్ల కలిగిన లాభం తక్కువ. కానీ టిల్లు స్క్వేర్ చూశాక ఒక్కసారిగా అభిమానులు అలెర్ట్ అయిపోయారు. నిజంగానే తాము చూస్తున్నది అభిమాన కథానాయికనేనా అనే సందేహంలో మునిగి తేలారు. ఘాడమైన లిప్పు లాకులతో సిద్దు జొన్నలగడ్డతో అమ్మడి కెమిస్ట్రీ చూశాక ఆల్రెడీ ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.

ఇక ఆసలు విషయానికి వస్తే అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా సైరెన్ ఇటీవలే తమిళంలో రిలీజయ్యింది. తెలుగులో ఈ శుక్రవారం విడుదల చేయాలనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల వాయిదా పడింది. అయితే ఒరిజినల్ వెర్షన్ కు ఆశించిన స్పందన రాలేదని కలెక్షన్లు, రివ్యూలు స్పష్టం చేస్తున్నాయి. అలా అని ఇందులో ఆషామాషీ క్యాస్టింగ్ లేదు. జయం రవి రెండు షేడ్స్ ఉన్న పాత్ర పోషించగా కీర్తి సురేష్ సినిమా మొత్తం కనిపించే పోలీస్ ఇన్స్ పెక్టర్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ దక్కింది. ఎటొచ్చి అనుపమకే కనీసం డైలాగులు లేక చాలా తక్కువ నిడివికి పరిమితమయ్యింది.

జైలు నుంచి పెరోల్ మీద బయటికొచ్చిన తండ్రి భార్యను దూరం చేసి తనకు ఈ స్థితికి కలిగించిన విలన్ల మీద ప్రతీకారం తీర్చుకోవడమే మెయిన్ పాయింట్. బోనస్ గా కూతురి సెంటిమెంట్ ని దట్టించారు. మర్డర్లు విచారణ చేసే ఆఫీసర్ కీర్తి సురేష్. విలన్లలో ఒకడిగా మన అజయ్ కనిపిస్తాడు. రొటీన్ ట్రీట్ మెంట్ తో సైరెన్ పెద్దగా మెప్పించలేకపోయింది. కొన్ని ఎమోషన్లు వర్కౌట్ అయినా ఫైనల్ గా సంతృప్తి కలిగించలేదు. అయలాన్, మలైకోట్టై వాలీబన్ లాగా కేవలం ప్రకటనకు పరిమితమవుతుందా లేక సైరన్ తెలుగులో తర్వాతైనా వస్తుందా ఇంకో వారం ఆగితే తెలుస్తుంది.