సుందరం మాస్టర్ ఇది మర్చిపోవద్దు

కమెడియన్ హర్ష చెముడు హీరోగా పరిచయమవుతున్న సుందరం మాస్టర్ ఇంకో మూడు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. సిద్దు జొన్నలగడ్డ లాంటి యూత్ స్టార్ ని తీసుకొచ్చి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేశారు. దీనికి మాస్ మహారాజా రవితేజ నిర్మాత అయినప్పటికీ అందుబాటులో లేని కారణంగా రాలేకపోయాడు. భారీ కాయం ఉన్నా ఆకట్టుకునే టైమింగ్, టాలెంట్ తో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న హర్షకు ఇది పెద్ద పరీక్ష. అసలే ఫిబ్రవరి లాంటి డ్రై నెలలో వస్తోంది. తన ఇమేజ్ ఎంతమేరకు జనాన్ని టికెట్లు కొనేలా చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక్కడ సుందరం మాస్టర్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కొన్నున్నాయి. మొదటిది ఎక్కువ శాతం ప్రేక్షకులకు సినిమా రీచ్ అవ్వాలంటే రెగ్యులర్ ప్రమోషన్లతో పనవ్వదు. ఏదో బలమైన కంటెంట్ ఉందనే అభిప్రాయం వాళ్ళ మనసులోకి వెళ్ళాలి. ఆ మధ్య అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కు అన్నీ ఘనంగా చేశారు కానీ రెండు మూడు రోజుల తర్వాత హడావిడి ఆగిపోయి యావరేజ్ దగ్గర నిలిచిపోయింది. అలా కాకుండా కనీసం పది రోజుల పాటు జనం నోళ్లలో నానేలా పబ్లిసిటీ చేసుకోవాలి. రవితేజ ప్రొడ్యూసర్ గా గత చిత్రం చాంగురే బంగారు రాజా ఏమయ్యిందో చూశాంగా.

హీరోగా హర్ష చెముడుకి ఇది సక్సెస్ కావడం వల్ల వరసగా ఆఫర్లు క్యూ కడతాయని కాదు. తన ప్రతిభ కొత్త కోణంలో ప్రపంచానికి పరిచయమవుతుంది. అలా అని సపోర్టింగ్ రోల్స్ ఆపకూడదు. కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించిన సుందరం మాస్టర్ సెటప్ గట్రా వెరైటీగా ఉన్నాయి. ఇంగ్లీష్ మాట్లాడే అటవీ ప్రాంతం ప్రజలు, అక్కడ ఇరుక్కుపోయిన ఒక టీచర్ ఇలా డిఫరెంట్ గా సెట్ చేసుకున్నారు. సస్పెన్స్ ఎలిమెంట్ కూడా ఏదో ఉందట కానీ ఇంకా రివీల్ చేయలేదు. మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా, భ్రమ యుగం, వ్యూహం, సిద్దార్థ్ రాయ్ లతో పోటీ అయితే గట్టిగానే ఉంది మరి.