శత్రువుల విధ్వంసానికి ఎయిర్ ఫోర్స్ ‘ఆపరేషన్’

ఎడతెరిపి లేకుండా రెండు మూడు వారాల నుంచి దేశం మొత్తం ప్రమోషన్ల కోసం తిరుగుతున్న వరుణ్ తేజ్ కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1 విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు హిందీ భాషల్లో ఒకేసారి బైలింగ్వల్ గా రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకుడు. సోనీ పిక్చర్స్ నిర్మాణ భాగస్వామ్యంలో భారీ బడ్జెతో ఇది రూపొందింది. వాస్తవానికి ఫిబ్రవరి రెండో వారంలోనే రిలీజ్ అనుకున్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్, ప్రచారానికి తగినంత సమయం లేకపోవడంతో వాయిదా వేశారు. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ జరిగింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పని చేసే అర్జున్(వరుణ్ తేజ్)కు భయమంటే తెలియదు. తనతో పాటే పని చేసే ఇష్టపడిన అమ్మాయి (మానుషీ చిల్లర్) వారిస్తున్నా సరే లెక్క చేయని రకం. ఫిబ్రవరి 14న శత్రు దేశం వెయ్యి కిలోల ఆర్డిఎక్స్ తో చేసిన దాడి వల్ల ఎందరో జవాన్లు ప్రాణాలు కోల్పోతారు. దీంతో నిగ్రహం కోల్పోయిన అర్జున్ ఎలాగైనా వాళ్ళ భరతం పట్టాలని నిర్ణయించుకుంటాడు. ప్రమాదకరమైన మిషన్ ను తలకెత్తుకుంటాడు. అయితే గతంలో జరిగిన అనుభవాలు, తీవ్ర గాయాల దృష్ట్యా అందరూ వద్దని హెచ్చరిస్తారు. అయినా సరే వెనుదీయని అర్జున్ సంకల్పం చివరికి ఏ గమ్యం చేరుకుంది.

ఆకాశం నేపథ్యంలో యుద్ధ సన్నివేశాలు, ఫ్లైట్లు వేసుకుని చేసే సాహసాలు బాగున్నాయి. విఎఫ్ఎక్స్ వాడినా చాలా సహజంగా అనిపించే విజువల్స్ తో దర్శకుడు శక్తి ప్రతాప్ తీసుకున్న శ్రద్ధ కనిపిస్తోంది. వరుణ్ తేజ్ మేకోవర్ తో పాటు సాధారణంగా తెలుగు కమర్షియల్ సినిమాల్లో తక్కువగా కనిపించే బ్యాక్ డ్రాప్ కొత్త ఫీలింగ్ ఇస్తోంది. మిక్కీ జె మేయర్ సంగీతం, హరి కె వేదాంతం ఛాయాగ్రహణం క్వాలిటీ పెంచడానికి దోహదపడ్డాయి. టాలీవుడ్ లో అరుదుగా జరిగే ఇలాంటి ప్రయత్నాలకు ఆడియన్స్ మద్దతు అవసరం. పూర్తి కంటెంట్ ఇదే స్థాయిలో ఉంటే వరుణ్ తేజ్ ఆపరేషన్ సక్సెస్ అయినట్టే