తెలుగు సినిమా గీత దాటుతోంది!

సినిమా అంటే థియేటర్లలోనే చూడాలి అనే పాత కాలం ధోరణులు మారాలిక. కనీసం చిన్న సినిమాలు అయినా ఓటిటి ప్లాట్ఫారం వాడుకోవడంపై దృష్టి పెట్టాలి. థియేటర్లలో విడుదల చేయడం వల్ల ప్రింట్లు, థియేటర్ల ఖర్చులు తప్ప చాలా సినిమాలకి కనీస వసూళ్లు రావు.

కంటెంట్ క్వాలిటీ పెంచుకుని, థియేటర్ల రెవిన్యూపై ఆధారపడకపోతే చిన్న సినిమా పరిఢవిల్లుతుంది. పెద్ద సినిమాలను కొనేంత స్థాయికి ఇండియాలో ఈ బిజినెస్ ఇంకా డెవలప్ అవలేదు. కానీ చిన్న సినిమాలు ఖచ్చితంగా ఈ వేదికని వాడుకోవడంపై శ్రద్ధ పెట్టవచ్చు.

లాక్ డౌన్ చిన్న సినిమాలను ఈ దశగా నడిపించడానికే వచ్చిందేమో అన్నట్టుగా ఉంది. ఇప్పటికే కొన్ని మీడియం రేంజ్ సినిమాలను కొనేయడానికే ఓటిటీలు ముందుకొస్తున్నాయి. అయితే నిర్మాతలే వెనక్కు తగ్గుతున్నారు. ఈ కొద్ది కాలం నష్టం కోసం సాంప్రదాయ థియేటర్స్ బిజినెస్ ఎందుకు పాడు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.
అయితే ఇక ఇప్పట్లో థియేట్రికల్ రిలీజ్ కష్టం అని అర్థం చేసుకున్న ‘అమృతరామమ్’ నిర్మాతలు ఈ నెల 29న జీ 5 ద్వారా తమ సినిమా రిలీజ్ చేస్తున్నారు. వీరిని చూసి మరింత మంది చిన్న నిర్మాతలు ఈ దిశగా అడుగులేసే అవకాశం లేకపోలేదు.