దేవర విడుదల వెనుక చక్కని వ్యూహం

జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీ దేవర పార్ట్ 1 విడుదల తేదీ అఫీషియల్ గా లాక్ చేసుకున్నారు. అక్టోబర్ 10 ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 5 నుంచి వాయిదా వేసుకున్నాక కొత్త అనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఒక దశలో పుష్ప 2 ది రూల్ కనక ఆగస్ట్ 15 వదులుకుంటే ఆ స్థానంలో దేవరని దించాలని అనుకున్నారు. కానీ హీరో బన్నీతో పాటు దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదనే సంకల్పంతో ఆఘమేఘాల మీద షూటింగ్ చేస్తున్నారు.

అక్టోబర్ పదో తేదీ వెనుక మంచి స్ట్రాటజీ ఉంది. రెండు రోజులకు దసరా పండగ వచ్చేస్తుంది. ఎంత లేదన్నా వారం మొత్తం కలిపి పది రోజుల దాకా సెలవులు వస్తాయి కాబట్టి వీకెండ్ తో పాటు హాలిడే సీజన్ పిల్లా పెద్దలను థియేటర్ల వైపు లాగేందుకు ఉపయోగపడుతుంది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేదా సూర్య కంగువాలు విజయదశమి వైపు కన్నేశాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేవర ముందస్తు జాగ్రత్త తీసుకోవడం మంచిదే. ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉన్నప్పటికీ ఆగస్ట్ లోపే పాటలతో సహా మొత్తం పూర్తి చేయాలనే సంకల్పంతో దర్శకుడు కొరటాల శివ పని చేస్తున్నారు.

అనిరుద్ రవిచందర్ పాటలను త్వరగా ఇస్తే ఇంకాస్త స్పీడ్ అందుకుంటుంది. అయితే ఇప్పుడేదో చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇదే డేట్ కి కట్టుబడి ఉంటారని చెప్పడానికి లేదు. పుష్ప 2 ఇండిపెండెన్స్ డేకి రాకపోతే దేవర ప్రీ పోన్ అయినా ఆశ్చర్యం లేదు. కానీ ఆ సూచనలు తక్కువే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న దేవరతో సైఫ్ అలీ ఖాన్ టాలీవుడ్ కు విలన్ గా పరిచయమవుతున్నాడు. టీజర్ ఇప్పటికే అంచనాలు పెంచేయగా ప్రస్తుతం కొద్దిరోజులు షూట్ కి బ్రేక్ ఇచ్చారు. అభిమానులు ఎదురు చూస్తున్న శుభవార్త వచ్చేసింది కాబట్టి ఇంకొన్ని రోజులు రిలాక్స్ అయిపోవచ్చు.