ఓయ్….ఇంత ప్రేమ అప్పుడు చూపించలేదే

ఇవాళ ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ రీ రిలీజ్ థియేటర్ యజమానులని ఆశ్చర్యపరిచింది. ఫామ్ లో లేని సిద్దార్థ్ లాంటి హీరో పాత సినిమాను ఎవరు చూస్తారనే అంచనాలకు భిన్నంగా ఈ రోజు ఉదయం షోలు చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. హైదరాబాద్ దేవి, భ్రమరాంబతో మొదలుకుని వైజాగ్ దాకా అన్ని చోట్ల ఇదే సంబరం కనిపిస్తోంది. ముఖ్యంగా పాటలకు సీట్ల నుంచి లేచి మరీ డాన్సులు చేస్తున్న వీడియోలు వైరలవుతున్నాయి. హీరోయిన్ షామిలికి సిద్దు పుట్టినరోజు సందర్భంగా వరస కానుకలతో సర్ప్రైజ్ ఇచ్చే ఎపిసోడ్ కి ఈలలు కేకలు వినిపిస్తున్నాయి.

2009లో రిలీజైన ఓయ్ ఆ టైంలో కమర్షియల్ ఫెయిల్యూర్. ఫీల్ గుడ్ ఎమోషన్ ఎంత ఉన్నా జనం రిసీవ్ చేసుకోలేదు. పైగా షామిలి పాత్రకు గీతాంజలి తరహా ఫినిషింగ్ ఇవ్వడం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చలేదు. సిద్దార్థ్ లో భావోద్వేగాలను దర్శకుడు ఆనంద్ రంగా ఎంత గొప్పగా ప్రెజెంట్ చేసినా లాభం లేకపోయింది. ఫలితంగా అతను మళ్ళీ మెగా ఫోన్ చేపట్టలేదు. యువన్ శంకర్ రాజా సాంగ్స్ ఛార్ట్ బస్టర్స్. ఏళ్ళు గడిచే కొద్దీ వైన్ విలువ పెరిగినట్టు ఓయ్ కు క్రమంగా కల్ట్ వేల్యూ అంతకంత పైకెళుతూ పోయింది. పదిహేనేళ్ల క్రితం మిస్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకవేళ ఓయ్ కి ఈ ఆదరణ 2009లోనే దక్కి ఉంటే ఎన్నో జీవితాలు మారేవి. సిద్దార్థ్ హీరోగా మరికొంత కాలం నిలదొక్కునేవాడు. ఆనంద్ రంగా మరిన్ని చిత్రాలతో కొత్త కథలు పరిచయం చేసేవాడు. షాలిని ఎక్కువ కనిపించేది. ఇవన్నీ మిస్ అయ్యాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న డిబేట్లు, సినిమాలో ఉన్న హైస్ గురించి చర్చించుకుంటున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలగక ముందు. ఇవాళ ప్రీమియర్లు వేస్తున్న ఊరిపేరు భైరవకోన తర్వాత ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నది ఒక్క ఓయ్ కు మాత్రమే. మిగిలినవాటికి స్పందన అంతంతమాత్రంగానే కనిపిస్తోంది.