ఈ ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజైన అన్ని సినిమాల్లోకి చిన్న మూవీగా భావించారు హనుమాన్‌ను అందరూ. కానీ ఆ సినిమా ఈ సంక్రాంతికే కాదు.. మొత్తం సంక్రాంతి చరిత్రలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. సరిపడా థియేటర్లు దొరక్క అనేక ఇబ్బందుల మధ్య రిలీజైన ఆ చిత్రం.. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టి పండుగ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో వసూళ్ల పరంగా అనేక రికార్డులను బద్దలు కొట్టింది.
విడుదలై నెల రోజులు అవుతున్నా హనుమాన్ రన్ ముగియలేదు. రెండు వారాల పాటు హౌస్ ఫుల్స్‌తో నడిచి.. తర్వాతి రెండు వారాల్లోనూ ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోందీ సినిమా. ఈ వారం రిలీజైన కొత్త సినిమాలకు దీటుగా హనుమాన్ నిలుస్తుండడం విశేషం. దీంతో పెద్ద సంఖ్యలో థియేటర్లు హనుమాన్ చిత్రాన్ని ఇంకా కొనసాగిస్తున్నాయి.
హనుమాన్ ఏకంగా 300 స్క్రీన్లలో 30 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకోవడం విశేషం. శత దినోత్సవాలు, అర్ధశతదినోత్సవాలు ఎప్పుడో చరిత్రలో కలిసిపోయి ఇప్పుడంతా రెండు మూడు వీకెండ్స్‌కే రన్ అయిపోతోంది. పెద్ద పెద్ద సినిమాలు కూడా నెల తిరిగేసరికి ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి.
మరో సంక్రాంతి సినిమా గుంటూరు కారం ఆల్రెడీ డిజిటల్‌గా రిలీజైన సంగతి తెలిసిందే. కానీ హనుమాన్ మాత్రం ఇంకా థియేటర్లలో బలంగా నిలుస్తోంది. ఇంకో రెండు మూడు వారాలు సినిమాకు ఢోకా లేనట్లే కనిపిస్తోంది. దీంతో హనుమాన్ 50 రోజుల సెంటర్లు కూడా పెద్ద సంఖ్యలో ఉంటాయనడంలో సందేహం లేదు. ఆ విషయంలోనూ హనుమాన్ రికార్డులు నెలకొల్పడం ఖాయం. తేజ సజ్జ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయగా.. నిరంజన్ రెడ్డి ప్రొడ్యూస్ చేశాడు