ఇప్పుడీ ప్రశ్న మన దేశంలో భారీ ఎత్తున ఓటిటి బిజినెస్ చేస్తున్న బడా సంస్థలను వేధిస్తోంది. మొన్నటి సంవత్సరం దాకా గ్లోబల్ కంటెంట్ పేరుతో కేవలం ఫారిన్, ఇంగ్లీష్, హిందీ బాషలకే ప్రాధాన్యం ఇస్తూ సౌత్ మార్కెట్ ని నిర్లక్ష్యం చేయడం ఎంత పెద్ద తప్పో నెట్ ఫ్లిక్స్ కి అర్థమయ్యింది. కాస్త ఆలస్యంగా దానికి తగ్గట్టే బిజినెస్ ప్లాన్ మొత్తం మార్చేసుకుంది. పెద్ద హీరోల సినిమాలు ఆచి తూచి స్ట్రీమింగ్ చేసే ట్రెండ్ లో కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్, యానిమల్, గుంటూరు కారంలను నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేయడం ఒక్కసారిగా మార్కెట్ ని కుదిపేసింది.
గతంలో ఈ డామినేషన్ అమెజాన్ ప్రైమ్ నుంచి ఎక్కువగా ఉండేది. కరోనా టైంలో నారప్ప, దృశ్యం 2, నాని వి, టక్ జగదీశ్, ఆకాశం నీ హద్దురా లాంటి క్రేజీ చిత్రాలను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయడం ద్వారా బాగా లాభ పడింది. కానీ తర్వాత వెబ్ సిరీస్ ల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో సినిమాలు కొనడం తగ్గించింది. ఈ గ్యాప్ ని నెట్ ఫ్లిక్స్ వాడుకుని వందా రెండు వందలు కాదు ఏకంగా వెయ్యి నుంచి రెండు వేల కోట్ల దాకా పెట్టుబడులు సిద్ధం చేసుకుని ప్యాన్ ఇండియా మూవీస్ కొనేసుకుంటూ వెళ్తోంది. అందుకే ఎంత పోటీ ఉన్నా దేవర, పుష్ప 2 లాంటివి నెట్ ఫ్లిక్స్ చేతికి వచ్చాయి.
రాబోయే రోజుల్లో పరిణామాలు ఇంకా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. నిర్మాతలు ఒకపక్క ఓటిటి మార్కెట్ తగ్గుతోందని టెన్షన్ పడుతున్న టైంలో పెద్ద హీరోలకు మాత్రం నెట్ ఫ్లిక్స్ గ్యారెంటీ ఆదాయ వనరుగా మారింది. హాట్ స్టార్ ఈ కాంపిటీషన్ తట్టుకునేందుకు కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన నెట్ ఫ్లిక్స్ సిఈఓ టాలీవుడ్ సెలెబ్రిటీస్ అందరినీ ఇంటికి వెళ్లి కలవడం వెనుక మతలబు ఏంటో అర్థమయ్యిందిగా. ఇకపై కూడా ఇదే దూకుడు కొనసాగిస్తే మళ్ళీ మునుపటి లాగా ఓటిటిల మధ్య విపరీత పోటీ పెరిగి హక్కుల రూపంలో నిర్మాతలకు ఆదాయం పెరగడం ఖాయం.