జైలర్ ప్రభావం ఎందుకు లేదంటే

మాములుగా ఒక పెద్ద స్టార్ హీరో బ్లాక్ బస్టర్ వచ్చాక అతని తర్వాతి సినిమాలకు విపరీతమైన డిమాండ్ వచ్చి రేట్లు కూడా అమాంతం పెరిగిపోతాయి. ఇది అందరికీ అనుభవమే. గీత గోవిందం వచ్చాక ఒక్కసారిగా విజయ్ దేవరకొండ మార్కెట్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఉప్పెన దెబ్బకు వైష్ణవ్ తేజ్ డేట్ల కోసం నిర్మాతలు ఫోన్లు చేశారు. అలాంటిది రజనీకాంత్ లాంటి గాడ్ ఐకాన్ కి జైలర్ ఇచ్చిన కిక్ ఎలాంటిదో వేరే చెప్పాలా. తెలుగులో ఆయన మార్కెట్ కు సింగిల్ డిజిట్ కు పడిపోయి చాలా కాలమయ్యింది. ఒక్కసారిగా దానికి ప్రాణం పోసిన ఘనతను జైలర్ సగర్వంగా అందుకుంది.

కట్ చేస్తే రేపు విడుదల కాబోతున్న లాల్ సలామ్ కు అసలు చప్పుడే లేకపోవడం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. ఆయన సోలో హీరోగా చేసిన మూవీ కాకపోవచ్చు. కానీ చెప్పుకోదగ్గ నిడివి ఉన్న మొయిన్ భాయ్ క్యారెక్టర్ చేశారు. అది కూడా కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోవాలి. చూస్తేనేమో తమిళనాడులోనే ఉదయం 9 గంటలకు షో వేసినా జనం రారనే అనుమానంతో చాలా మల్టీప్లెక్సులు పది తర్వాత ప్లాన్ చేసుకున్నాయి. దీన్ని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడే ఇలా ఉంటే మరిక్కడ.

అసలు జైలర్ ప్రభావం ఎందుకు లేదంటే లాల్ సలామ్ విషయంలో నిర్మాతలు సరైన ప్లానింగ్ ని పాటించకపోవడమే. టైటిల్ మాస్ కి రీచ్ అయ్యే విధంగా లేకపోవడం ఒక మైనస్ అనుకుంటే, రజని పాత్ర కనెక్టివిటీ అందరికీ చేరేలా దర్శకురాలు శ్రద్ధ తీసుకోకపోవడం. ఈ రెండు అంశాలతో పాటు అసలు కంటెంట్ క్రికెట్ గురించా లేక ఒక గ్రామంలో ఉన్న పగల గురించా అనే క్లారిటీ సరిగ్గా ఇవ్వలేకపోవడం. సినిమా చూశాక ఇవన్నీ అర్థం కావడం వేరు, ముందే ప్రిపేర్ చేయడం వేరు. అయినా జైలర్ ఎంత గొప్ప విజయం సాధించినా రజనికి తెలుగులో పాత మార్కెట్, క్రేజ్ ని తిరిగి ఇంకా తేలేదన్నది తేలిపోయిందిగా.