నెగిటివ్ సెంటిమెంటుని రజని దాటేస్తారా

నిన్న ట్రైలర్ చూశాక అభిమానులకు కలిగిన సందేహం ఇదే. ఈ శుక్రవారం విడుదల కాబోతున్న లాల్ సలామ్ చూసేందుకు ఏవైనా కారణాలు చెప్పమంటే రెండే గుర్తొస్తాయి. ఒకటి రజినీకాంత్. రెండు ఏఆర్ రెహమాన్. క్రేజీ కాంబినేషన్ ఉన్నా సరే ఆశించిన స్థాయిలో దీని మీద బజ్ రావడం లేదు. అరగంటకు పైగానే సూపర్ స్టార్ పాత్ర ఉంటుందని టీమ్ చెబుతున్నా ఆ మేరకు హైప్ పెరుగుతున్న సూచనలు లేవు. తమిళంలోనే అంతంత మాత్రంగా ఉంటే ఇక తెలుగులో సంగతి వేరే చెప్పాలా. ఇక్కడ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న విషయం మరొకటి ఉంది. అదే నెగటివ్ సెంటిమెంట్.

రజనీకాంత్ గెస్ట్ రోల్స్ చేసిన తమిళ, హిందీ సినిమాలు పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. ఒక్క పెదరాయుడు మాత్రమే రికార్డులు నమోదు చేసింది తప్పించి మిగిలినవన్నీ సోసోనే. 1993లో వల్లి అనే చిత్రంలో రజని ఒక కీలక పాత్ర పోషించారు. ఇక్కడ విజయగా అనువదించారు. అస్సలు ఆడలేదు. 2008లో కుసేలన్ రీమేక్ కథానాయకుడులో జగపతిబాబు ఫ్రెండ్ గా నటుడి క్యారెక్టరే చేశారు. కానీ ఫలితం ఫ్లాప్. షారుఖ్ ఖాన్ అడిగాడని రా వన్ లో రోబో గెటప్ లో అలా కొన్ని నిముషాలు కనిపిస్తారు. అంతకు ముందు హిందీలో చాలానే ఉన్నాయి ఏవీ గుర్తించుకునే రేంజ్ లో వెళ్ళలేదు.

ఇప్పుడు లాల్ సలామ్ వంతు వచ్చింది. నిజానికి ఇందులో హీరో విష్ణు విశాల్. ఒక గ్రామంలో రెండు వర్గాల మధ్య తలెత్తిన సమస్యని క్రికెట్ ద్వారా పరిష్కరించేందుకు ప్రయత్నించే ముస్లిమ్ పెద్దమనిషిగా రజనీకాంత్ కనిపిస్తారు. సెకండ్ హాఫ్ లో ఎంట్రీ ఉంటుందని టాక్. బిజినెస్ కోసం ట్రైలర్ లో ఎక్కువగా హైలైట్ చేశారు కానీ కేవలం ఆయన్ను నమ్ముకుని వెళ్లకూడదని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. ఏది ఏమైనా అంచనాల విషయంలో వెనుకబడ్డ లాల్ సలామ్ కు రజని కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ పెట్టారు.