ఇంకో సినిమా.. సైలెంటుగా రేసులోకి

సంక్రాంతి తర్వాత తెలుగు ప్రేక్షకుల దృష్టి వచ్చే వీకెండ్ రాబోయే సినిమాల మీద పడింది. అందుకు ప్రధాన కారణం.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకుని ఫిబ్రవరి 9న రిలీజవుతున్న ‘ఈగల్’ మూవీనే. రవితేజ లాంటి స్టార్ హీరో, పీపుల్స్ మీడియా లాంటి పెద్ద బేనర్, కార్తీక్ ఘట్టమనేని లాంటి ఎగ్జైటింగ్ డైరెక్టర్.. ఇలా ఈ సినిమా మీద ఆసక్తి కలగడానికి చాలా కారణాలే ఉన్నాయి.

సంక్రాతి రేసు నుంచి తప్పుకుంటే సోలో రిలీజ్ డేట్ ఇస్తామన్న నిర్మాతల మండలి హామీ మేరకు ఈ చిత్రం వాయిదా పడింది. అలా అని ఆ సినిమాకు పోటీ లేకుండా ఏమీ లేదు. ఈగల్ మేకర్స్ అభ్యంతరాల మేరకు ‘ఊరు పేరు భైరవకోన’ అనే కొంచెం క్రేజున్న సినిమాను రేసు నుంచి తప్పించారు. ఈగల్‌కు పెద్దగా ఇబ్బంది లేదనుకున్న మరో మూడు చిత్రాలు ఈ వీకెండ్లో రాబోతున్నాయి.

వైఎస్ జగన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ మూవీ ‘యాత్ర-2’ ఫిబ్రవరి 8న రిలీజ్ కాబోతోంది. తర్వాతి రోజు ‘ఈగల్’తో పాటుగా సూపర్ స్టార్ రజినీకాంత్ క్యామియో రోల్ చేసిన తమిళ అనువాద చిత్రం ‘లాల్ సలాం’ విడుదలవుతుంది.

ఇప్పుడు వీటికి తోడుగా ఈ వీకెండ్లోకి సైలెంటుగా ఇంకో సినిమా వచ్చింది. అదే.. ట్రూ లవర్. ఇది తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన లవ్ స్టోరీ. ఇందులో హీరో తమిళుడైన మణికందన్ కాగా, హీరోయిన్ తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియారెడ్డి. ఫిబ్రవరి 10న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. దీని ట్రైలర్ చూస్తే ‘బేబి’ తరహా సినిమాలా కనిపించింది. వాలెంటైన్స్ డే వీకెండ్‌కు పర్ఫెక్ట్‌గా సూటవుతుందని ఫిబ్రవరి 10న రిలీజ్ చేస్తున్నారు. మారుతి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. ప్రభురామ్ వ్యాస్ ఈ చిత్రాన్ని రూపొందించాడు.