యాత్ర 2లో చూపించేది ఒకవైపు రాజకీయమే

రాబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో నిర్మించిన యాత్ర 2 వచ్చే వారం ఫిబ్రవరి 8 విడుదలకు రెడీ అవుతోంది. ముందు నుంచి అధికార పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రస్థానాన్ని తెరమీద చూపించే ఉద్దేశంతో దర్శకుడు మహి వి రాఘవ్ దీన్ని రూపొందించిన విషయంలో ప్రమోషన్లలోనే చెబుతున్నారు. యాత్రలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర, రాజకీయ ప్రయాణం హైలైట్ చేస్తే యాత్ర 2లో జగన్ తండ్రి చనిపోయాక జరిగిన పరిణామాలను చూపించబోతున్నారు. ఇంకో అయిదు రోజుల్లో రిలీజ్ కానుండగా ఇవాళ ట్రైలర్  వదిలారు.

అందరికీ తెలిసిన కథే ఇందులో ఉంది. కాకపోతే జగన్ కోణంలో జరుగుతుంది. పేదలకు వైద్యం ఉచితంగా అందించాలన్న సంకల్పంతో ఉన్న రాజశేఖర్ రెడ్డి(మమ్ముట్టి)చనిపోయాక జగన్ (జీవా) వేరు పార్టీ పెట్టే ఉద్దేశం కనిపెట్టిన కాంగ్రెస్ పార్టీ అతన్ని వివిధ కేసుల మీద జైలుకు పంపిస్తుంది. అయినా భయపడకుండా బయటికొచ్చిన జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి జనాలను కలుసుకుంటాడు. ఎలక్షన్లలో గెలిచి అధికార పీఠాన్ని దక్కించుకుంటాడు. ప్రతిపక్ష నాయకుడు(మహేష్ మంజ్రేకర్)ని ఓడించి గెలుపు గుర్రం ఎక్కుతాడు. ఇదే యాత్ర 2.

ఇందులో ప్రత్యేకంగా అన్నీ నిజాలే ఉంటాయని అనుకోవడానికి లేదు కానీ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా కథలు చెప్పడంలో నేర్పరి అయిన మహి వి రాఘవ యాత్ర 2కి అదే రూటు పట్టినట్టు ఫస్ట్ సీన్ లో మూగ చెవిటి పాప ఎపిసోడ్ లోనే అర్థమవుతుంది. మమ్ముట్టి క్యామియో చేయగా జీవా వేషభాషలు జగన్ ని పోలి ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రస్తావన నేరుగా వినిపించింది.  వర్మ తీసిన వ్యూహం లాగా దీని మీద ప్రస్తుతానికి అభ్యంతరాలు కనిపించడం లేదు. ఏపీ పొలిటికల్ వార్ వేడెక్కుతున్న టైంలో ఈ సినిమాకు ఎలాంటి స్పందన దక్కుతుందో చూడాలి.