ఏడాది సమయం ఉన్నప్పటికీ వచ్చే సంక్రాంతికి ఇప్పటి నుంచే పోటీ మొదలయిపోయింది. మొన్న థియేటర్ల పంపకాల విషయంలో జరిగిన రచ్చ చూసి నిర్మాతలు సంవత్సరం ముందే అలర్టతున్నారు. రవితేజ ఈగల్ తప్పుకుంది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే మొన్న పండగ కలెక్షన్లు మరింత తీవ్రంగా ప్రభావితం చెందేవి. హనుమాన్ విజేతగా నిలిచినా గుంటూరు కారం, నా సామిరంగ స్టామినాలను బాక్సాఫీస్ పూర్తిగా వాడుకోలేదు. ఇక 2025 బరిలో ముగ్గురు సీనియర్ హీరోలు కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. వాళ్ళలో అధికారికంగా చెప్పిన స్టార్ చిరంజీవి విశ్వంభర.
జనవరి 10 విడుదల చేస్తామని అఫీషియల్ గా ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా వదిలారు. మెగాస్టార్ ఈ రోజు సెట్లలో జాయిన్ అయ్యారు. ఇటీవలే జరిగిన నా సామిరంగ సక్సెస్ మీట్ నాగార్జున వచ్చే సంక్రాంతికి కలుస్తానని చెప్పడం ఫ్యాన్స్ లో ఆసక్తి రేపింది. అయితే శేఖర్ కమ్ములతో ధనుష్ తో చేస్తున్న మల్టీ స్టారర్ కోసమా లేక ప్లానింగ్ లో ఉన్న బంగార్రాజు 3ని ఉద్దేశించా అనేది చెప్పలేదు. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో దిల్ రాజు ప్లాన్ చేస్తున్న ఎంటర్ టైనర్ ని ముందు జాగ్రత్తగా సంక్రాంతి విడుదల ట్యాగ్ తో అనౌన్స్ మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారట. కథ ఫైనల్ కాగానే చెప్పేస్తారు.
దీనికన్నా ముందు ప్రకటించిన శతమానం భవతి నెక్స్ట్ పేజీని దిల్ రాజు వేసవికి షిఫ్ట్ చేస్తారట. ఇక్కడిదాకా బాగానే ఉంది ఇంకా ఎవరెవరు వస్తారనేది వేచి చూడాలి. బాలకృష్ణ బాబీ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ అంత ఆలస్యం కాకపోవచ్చు. భగవంత్ కేసరి లాగా దసరా పండక్కు రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కాకపోతే భారీ చిత్రం కావడంతో ఆ టైంకంతా షూటింగ్ పూర్తి కావడం అనుమానమే. ఒకవేళ లేట్ అయితే మాత్రం రేసులో బాలయ్య కూడా తోడవుతారు. అప్పుడు పోటీ ఇంకా రసవత్తరంగా మారుతుంది. వాయిదాలు అలవాటైన ట్రెండ్ లో వీళ్ళలో ఎందరు మాట మీద ఉంటారో.