షూటింగ్ కాకుండానే ‘ఫిలిం ఫెస్టివల్’లో విడుదల

దర్శకుడు వెట్రిమారన్ తీసిన విడుదల పార్ట్ 1 విమర్శకుల ప్రశంసలను ఏ స్థాయిలో అందుకుందో చూశాం. తమిళంలో మంచి విజయం సాధించింది కానీ తెలుగులో ఆ స్థాయి స్పందన దక్కలేదు. మనకు కనెక్ట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్న జానర్ కావడంతో ఇక్కడి ఆడియన్స్ కి రీచ్ కాలేదు. ఓటిటిలో చూసి శెభాష్ అన్న వాళ్లే ఎక్కువ. అప్పటి నుంచే రెండో భాగం మీద అంచనాలు పెరిగిపోయాయి. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ లో కొంత ఫుటేజ్ చూపించి ఊరించిన వెట్రిమారన్ తాజాగా నెదర్లాండ్స్ లో జరిగిన రాటెన్ డాం ఫిలిం ఫెస్టివల్ లో పార్ట్ 1 అండ్ 2 స్క్రీన్ చేయడం షాక్ ఇచ్చింది.

నిజానికి విడుదల పార్ట్ 2 షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. మరి ప్రీమియర్ ఎలా సాధ్యమయ్యిందనేగా మీ డౌట్. అప్పటిదాకా తీసిన భాగాలను తెలివిగా ఎడిట్ చేయించి ప్రత్యేక వర్షన్ ని తయారు చేయించారట వెట్రిమారన్. దాంతో సీక్వెల్ లోని కొంత కీలక భాగం మిస్ అయినా ప్రేక్షకులకు ఆ ఫీలింగ్ కలగకుండా మేనేజ్ చేశారు. దీంతో షో అవ్వగానే వచ్చిన ఆహూతులందరూ లేచి నిలబడి చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సుమారు అయిదు నిమిషాల పాటు నాన్ స్టాప్ గా కరతాళ ధ్వనులు వినిపించాయి. విజయ్ సేతుపతి, సూరి తదితరులు ఈ ప్రీమియర్ కి హాజరయ్యారు.

ఈ ఏడాది వేసవిలోగా విడుదల పార్ట్ 2 చిత్రీకరణ పూర్తి చేయాలనే సంకల్పంతో ఉన్న వెట్రిమారన్ ఈసారి అన్ని బాషల ఆడియన్స్ ని మెప్పిస్తానని దేమా వ్యక్తం చేస్తున్నారు. పార్ట్ 1లో విజయ్ సేతుపతి పాత్ర చాలా పరిమితంగా ఉంది. రెండో భాగంలో మాత్రం కథ మొత్తం ఆయన గురించే ఉంటుందట. ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్న ఈ నక్సలైట్ డ్రామా పూర్తి అయ్యాకే సూర్య వడివాసల్ ని వెట్రిమారన్ కొనసాగించబోతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలని ఉండనే కోరికను వెలిబుచ్చారు కానీ ప్రాక్టికల్ గా అది ఇప్పట్లో సాధ్యమయ్యే సూచనలు లేవు.