నిర్మాతల అవసరం ఓటిటిలకు అవకాశం

థియేట్రికల్ రిలీజ్ కు ఓటిటి స్ట్రీమింగ్ కి మధ్య కనీసం ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలని గతంలో నిర్మాతలు పెట్టుకున్న నిబంధన వాస్తవంగా ఎవరూ పాటించడం లేదని స్పష్టంగా అర్ధమవుతోంది. సలార్ ఇంకా ఆడుతుండగానే కేవలం 28 రోజుల గ్యాప్ తో నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమయ్యింది. వ్యూస్ హోరెత్తిపోతున్నాయి కానీ చాలా త్వరగా వచ్చిందనేది ఒప్పుకోవాలి. డెవిల్ రెండు వారాలకే డిజిటల్ లో వచ్చి షాక్ ఇచ్చింది. అలా అని మరీ బ్యాడ్ మూవీ కాదు. మొన్న వచ్చిన లీకును నిజం చేస్తూ వెంకటేష్ సైంధ‌వ్‌ ఫిబ్రవరి 3 నుంచి ప్రైమ్ లో విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

ఇలా చేయడం తప్పా ఒప్పా అనే డిబేట్ గురించి వెంటనే ఒక నిర్ధారణకు రాలేం. ఎందుకంటే కోట్ల పెట్టుబడి పెట్టిన నిర్మాత తన వస్తువును ఎవరికి ఎప్పుడు అమ్మాలో నిర్ణయించుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఒప్పందం చేసుకునే టైంలో తన కంటెంట్ ఇంతకు మించి ఆడదు అనుకున్నప్పుడు లేదా భారీ మొత్తాన్ని సదరు ఓటిటి ఆఫర్ చేసినప్పుడు ఒప్పేసుకుంటాడు. ఇందులో తప్పేం లేదు. డిజాస్టర్ అయినప్పుడు నష్టాల నుంచి డిస్ట్రిబ్యూటర్లను కొంతైనా ఆదుకోవాలంటే డిజిటల్ సంస్థల నుంచి పెద్ద మొత్తాలు తీసుకున్నప్పుడే సాధ్యమవుతుంది. ప్రొడ్యూసర్లు చేస్తోంది ఇదే.

ఇంకోవైపు ఇలా రెండు మూడు వారాలకు ఇచ్చేస్తే యావరేజ్ సినిమాల కోసం జనాలు థియేటర్లలకు రారనే వాదన ఇంకో వైపు ఉంది. దీన్నీ పూర్తిగా నిజం అనలేం. ఎందుకంటే కంటెంట్ బాగుంటే హీరో ఎవరనేది పట్టించుకోకుండా బ్రహ్మరథం పడతారని హనుమాన్, బలగం లాంటివి ఋజువు చేశాయి. బాలేకపోతే తిప్పి కొడతారని భోళా శంకర్, సైంధ‌వ్‌ లు నిరూపించాయి. అలాంటప్పుడు ఫైనల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమాను నిలబెట్టేది అందులో మ్యాటరే తప్ప హంగులు ఆర్భాటాలు కాదు. అవకాశం అవసరం ఒక నాణేనికి రెండు వైపులా ఉన్నప్పుడు ఎవరో ఒకరిని నిందించడానికి లేదు.