కాదేది క్రియేటివిటీకి అనర్హం అన్నారు పెద్దలు. రొటీన్ ఫార్ములాలు స్టార్ హీరోలకే వర్కౌట్ కాని రోజుల్లో చిన్న సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించాలంటే కంటెంట్ చాలా కీలకం. కథ ఎలా రాసుకున్నామనే దానితో పాటు పాయింట్ ఎంత వెరైటీగా ఉందనేది ముఖ్యం. మాములుగా ఉంటే ప్రేక్షకులు మొహమాట పడటం లేదు. అందుకే ‘మార్కెట్ మహాలక్ష్మి’ బృందం అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్ నే ఎంచుకుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. త్వరలో విడుదలకు సిద్ధం కాబోతున్న ఈ మూవీ థీమ్ వెరైటీగా ఉంది.
మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రేమిస్తే ఎలా ఉంటుందనే నేపథ్యంలో దర్శకుడు విఎస్ ముఖేష్ ఈ లవ్ ఎంటర్ టైనర్ ని రూపొందించారు. ఈయనకిది డెబ్యూ సినిమా. కేరింత లాంటి యూత్ ఫుల్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న పార్వతీశం హీరోగా నటిస్తుండగా టైటిల్ రోల్ ప్రణికాన్వికా పోషిస్తోంది. బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కిలారు నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో థియేటర్లలో అడుగు పెట్టేందుకు సిద్ధ పడుతోంది. టైటిల్ నుంచే ఆసక్తిని రేపుతోంది.
హర్షవర్షన్, ముక్కు అవినాష్, మహబూబ్ బాషా తదితరులు ఇతర తారాగణం. మిస్టర్ జో పాటలు, సృజన్ శశాంక నేపధ్య సంగీతం, సురేంద్ర చిలుముల ఛాయాగ్రహణం, ఆర్ఎం విశ్వనాథ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్న మార్కెట్ మహాలక్ష్మిని ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందించారట. ఈ మధ్య కాలంలో కాయగూరలు అమ్మే అమ్మాయిలు, కూరల వ్యాపారం చేసే మహిళలు బాగా పాపులర్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంతో ఒక లవ్ స్టోరీ తీయడం అంటే ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్టే. మెప్పించడమే తరువాయి.