గత ఏడాది పఠాన్, జవాన్, యానిమల్ లాంటి బ్లాక్‌బస్టర్లతో బాలీవుడ్ బాగానే పుంజుకున్నట్లు కనిపించింది. కొత్త ఏడాది మీద బోలెడు ఆశలతో ఉన్నారు అక్కడి నిర్మాతలు. ముందుగా వారి దృష్టంతా ‘ఫైటర్’ మీదే నిలిచింది. గత ఏడాది రిపబ్లిక్ డే కానుకగా రిలీజై బ్లాక్‌బస్టర్ అయిన ‘పఠాన్’ చిత్రాన్ని రూపొందించిన సిద్దార్థ్ ఆనందే దీనికీ దర్శకుడు. దీంతో మరోసారి అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అంచనా వేశారు. కానీ ‘పైటర్’ మీద పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
లో బజ్, డివైడ్ టాక్‌తో తొలి రోజు డల్లుగా మొదలై.. ఆ తర్వాతి మూడు రోజుల్లో మంచి వసూళ్లు సాధించిన ‘ఫైటర్’.. వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలబడలేకపోయింది. సోమవారం వసూళ్లలో డ్రాప్ ఉంటుందని అంచనా వేశారు కానీ.. మరీ ఇండియా అంతా కలిపి నెట్ వసూళ్లు రూ.8 కోట్లకు పరిమితం కావడం మాత్రం ఊహించని దెబ్బే.
సినిమా బాక్సాఫీస్ దగ్గర నిలబడే పరిస్థితి లేదనడానికి ఈ వసూళ్లే సంకేతాలు. కనీసం డబుల్ డిజిట్ ఫిగర్స్ అయినా వస్తాయని ఆశిస్తే మరీ కనీస స్థాయిలో కలెక్షన్లు ఉన్నాయి. మంగళవారం కూడా ఫైటర్ బాక్సాఫీస్ పెర్పామెన్స్ డల్లుగానే ఉంది. ప్రస్తుతం ఇండియా నెట్ వసూళ్లు రూ.120 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ రూ.200 కోట్ల మార్కును దాటింది. రూ.250 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమాకు ఈ ఓపెనింగ్స్ చాలా తక్కువ.
వీక్ డేస్ రాగానే వసూళ్లు ఇంతగా డ్రాప్ అయ్యాయంటే ‘ఫైటర్’ జెట్ క్రాష్ ల్యాండింగ్ అయినట్లే. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ‘పఠాన్’తో ‘ఫైటర్’ను పోల్చుకోవడానికి కూడా లేదు. అందులో మూడో వంతు వసూళ్లు కూడా ‘ఫైటర్’ సాధించేలా లేదు.