హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాన్ఫిడెన్స్ ఎలాంటిదో తెలిసిందే. తొలి చిత్రం ‘అ!’ రోజుల నుంచి తన మాటలు, స్టేట్మెంట్లు పెద్ద రేంజిలో ఉండేవి. ఇక ఇప్పుడు హనుమాన్‌తో భారీ విజయాన్నందుకున్నాడు. దీంతో అతడి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. ఇప్పుడతను హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ వచ్చినా సినిమా చేసేది లేదంటున్నాడు. ఇంతకుముందు స్టార్లతో సినిమాలు చేయడానికి ప్రయత్నించి సమయం వృథా చేసుకున్నానని.. అందుకే ఇప్పుడు తనకు కంఫర్ట్ ఉన్న, వేగంగా సినిమాలు చేయగలిగే వాళ్లతోనే సాగిపోతున్నట్లు చెప్పాడు.
స్టార్ హీరోలతో సినిమాల కోసం ప్రయత్నించి ఫెయిలైన తర్వాత తాను డెడ్ లైన్లు పెట్టుకుని సినిమాలు చేస్తున్నానని.. అందువల్ల ఫ్రీక్వెన్సీ పెరిగిందని ప్రశాంత్ చెప్పాడు. అందుకే ఇప్పుడు టామ్ క్రూజ్ వచ్చి సినిమా చేద్దామన్నా తాను ఆల్రెడీ కమిటైన తన వాళ్లతోనే సినిమా చేస్తానని అతను చెప్పాడు.
ఇక రాజమౌళి మీద తన అభిమానాన్ని చాటుకుంటూ.. ఆయనకు తాను ఏకలవ్య శిష్యుడినని చెప్పాడు ప్రశాంత్. కాలేజీ రోజుల్లో రాజమౌళి మీద అభిమానం ఏర్పడి ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరతానని మెయిల్ పెట్టానని.. కానీ ఆయన తన టీంలో ఖాళీ లేకపోవడం వల్ల సున్నితంగా తిరస్కరించారని.. దీంతో ఆయన మీద కోపం పెంచుకున్నానని ప్రశాంత్ వెల్లడించాడు. ఐతే తర్వాత ఏకలవ్య శిష్యుడి గురించి గుర్తుకు వచ్చి.. తానూ అలా రాజమౌళికి శిష్యుడిగా మారానని.. ఆయన సినిమాలు, మేకింగ్ వీడియోలు చూసి ఎంతో నేర్చుకున్నానని ప్రశాంత్ చెప్పాడు.