హిందూ పురాణ పురుషుల పాత్రలను సరిగ్గా వాడుకుంటే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో హనుమాన్ సినిమా రుజువు చేసింది. ఇందులో హనుమంతుడి పాత్రను అద్భుతంగా చూపించిన ప్రశాంత్ వర్మ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఐతే పురాణ పురుషుల పాత్రలను ఎలా చూపించకూడదో చెప్పడానికి గత ఏడాది ‘ఆదిపురుష్’ సినిమా నిదర్శనం. మన హీరో అని మొహమాటపడకుండా మాట్లాడుకుంటే రాముడి పాత్రలో ప్రభాస్‌ను కూడా అందులో సరిగా చూపించలేదు.
ఇక రావణుడి పాత్రలో సైఫ్‌ను చూపించిన విధానం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. మిస్ కాస్టింగ్, చెత్త విజువలైజేషన్‌తో రామాయణాన్ని ఎంతగా చెడగొట్టాలో అంతగా చెడగొట్టాడు ఓం రౌత్. ఐతే ఇప్పుడు బాలీవుడ్లో మరో రామాయణానికి రంగం సిద్ధమైంది. ఆదిపురుష్ లాగా కాకుండా ఈ సినిమా బెటర్‌గా ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
దంగల్ దర్శకుడు నితీశ్ తివారి రూపొందించనున్న ఈ రామాయణంలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్ కనిపించబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ కాస్టింగ్‌ను ధ్రువీకరిస్తూ ట్వీట్ వేశాడంటే.. ఈ ముగ్గురే ముఖ్య పాత్రలను పోషిస్తున్నాడని ఖరారైంది. ఈ రామాయణం మూడు భాగాలుగా తెరకెక్కనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
ఈ మెగా ప్రాజెక్టులో టాలీవుడ్ సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ కూడా భాగం కానున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. మరి ఇప్పుడు కూాడా ఆయన ఈ ప్రాజెక్టులో ఉన్నాడో లేదో చూడాలి. సరైన కాస్టింగ్ ఎంచుకోవడంతోనే నితీశ్ తివారి సగం సక్సెస్ అయిపోయాడు. ఇక ఆదిపురుష్ తరహా పిచ్చి విజువలైజేషన్ లేకుండా.. సహజంగా ఈ కథను తెరకెక్కిస్తే అద్భుతమైన ఫలితాన్ని అందుకోవడానికి అవకాశముంటుంది.