చైల్డ్ ఆర్టిస్ట్ గా చిన్నప్పుడు ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించిన దీపక్ సరోజ్ ఇప్పుడు హీరో అయిపోయాడు. కొత్త దర్శకుడు యశస్వి రూపొందిస్తున్న సిద్దార్థ్ రాయ్ ద్వారా కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇవాళ ట్రైలర్ లాంఛ్ చేశారు. నెలల క్రితమే టీజర్ రిలీజైనప్పటికీ విడుదల తేదీకి సరైన డేట్ దొరక్క వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు ఫైనల్ కాపీ సిద్ధం చేసుకుని ప్రమోషన్ల పనులు మొదలుపెట్టారు. పూర్తిగా యూత్ ని టార్గెట్ చేసుకున్న యశస్వి తాను చెప్పబోతున్న కథేంటో రెండు నిమిషాల వీడియోలోనే సరిపడా క్లూస్ ఇచ్చారు. అవేంటో చూద్దాం.
అపారమైన తెలివితేటలు ఉన్న సిద్దార్థ్ రాయ్(దీపక్ సరోజ్)కు ఎమోషన్స్ ఉండవు. ఏది చేయాలనిపిస్తే వెంటనే చేసెయ్యడం, ముందు వెనుకా ఆలోచించకపోవడం అతని స్టైల్. ఆఖరికి పనిమనిషితో శృంగారానికి కూడా సై అనేంత. ఇలాంటి మనస్తత్వం ఉన్న సిద్దుకి కాలేజీలో ఓ అమ్మాయి(తన్వి నేగి) పరిచయమవుతుంది. భావోద్వేగాల గురించి చెబుతూ మనిషిగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది. కొంత కాలం బాగున్నా సిద్దు మళ్ళీ మొదటికే వచ్చి ఇంకా విపరీతంగా మారిపోతాడు. ఫలితంగా పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాల్సి వస్తుంది. ఇంతకీ తన ప్రయాణం ఎక్కడికి చేరుకుందో తెరమీద చూడాలి.
అర్జున్ రెడ్డి ఛాయలు స్పష్టంగా కనిపించాయి. ట్రీట్ మెంట్ వేరుగా ఉండొచ్చేమో కానీ ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం ఇదే అనిపిస్తుంది. కాకపోతే విజయ్ దేవరకొండని మించి దీపక్ సరోజ్ ని ఎక్స్ ట్రీమ్ గా చూపించే ప్రయత్నం చేశాడు యశస్వి. సంగీతం రదనే సమకూర్చడం గమనార్హం. టెక్నికల్ గా స్టాండర్డ్ కనిపిస్తోంది. హీరో కన్నా హీరోయిన్ అందం, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. అర్జున్ రెడ్డి స్ఫూర్తి తీసుకున్నారో లేక అనుకోకుండా జరిగిందో కారణం ఏదైనా ఆడియన్స్ ని మెప్పించాలంటే సిద్దార్థ్ రాయ్ ముందు పెద్ద ఛాలెంజే ఉంది. డేట్ లాక్ చేయలేదు కానీ రిలీజ్ ఫిబ్రవరిలోనే జరగనుంది.