ప్రముఖ కథా రచయితగా టాలీవుడ్ లో ఎంతో పేరు గడించి ఆ తర్వాత రాజమౌళి తండ్రిగా ఎన్నో ఇండస్ట్రీ హిట్లలో భాగం పంచుకుంటున్న విజయేంద్ర ప్రసాద్ గారు నిన్న జరిగిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ సందర్భంగా పలు ఇంటర్వ్యూలిచ్చారు. ఒక సీనియర్ సిటిజెన్ గా, రాముడి గుడి ప్రస్థానం గురించి ఎన్నో విషయాలు తెలిసిన వ్యక్తిగా ఆయన నుంచి కొన్ని ముఖ్యమైన ఇన్ ఫుట్స్ తీసుకునే ఉద్దేశంతో పలు ఛానల్స్ ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించాయి. కాన్సెప్ట్ ఏదైనా యాంకర్ల వైపు నుంచి మహేష్ బాబు 29 సినిమాతో పాటు ఆర్ఆర్ఆర్ ప్రస్తావన తప్పకుండ వస్తోంది.
అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చే క్రమంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రల ప్రాధాన్యం గురించి అన్న మాటలు ఫ్యాన్స్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. క్లైమాక్స్ లో విల్లంబులు పట్టుకుని రామరాజు ఎంట్రీతో ఆ క్యారెక్టర్ హైలైట్ అయ్యిందని, అక్కడ భీమ్ చేసిందేమి లేదనే తరహాలో ఓసారి మాట్లాడారు. ఇంకో చోట చరణ్ పాత్ర ఎవరైనా చేయొచ్చు కానీ తారక్ పోషించిన కొమరం భీమ్ మాత్రం అందరి వల్ల కాదని చెప్పారు. సరిగ్గా ఈ రెండు పాయింట్లు పట్టుకుని ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తమకు అనుకూలంగా ఉన్న క్లిప్స్ తీసుకుని కంటెంట్ ని వైరల్ చేయడం మొదలుపెట్టారు.
నిజానికి విజయేంద్ర ప్రసాద్ ఉద్దేశం వేరైనప్పటికీ దానికి సంబంధించిన ప్రచారం మాత్రం పక్కదారి పడుతోంది. దీని వల్ల అవసరం లేని అపార్థాల పర్వం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాకా ఓవర్సీస్ నుంచి లోకల్ థియేటర్ దాకా పబ్లిక్ అంతా యునానిమస్ గా ఒకే మాట మీద నిలుచుంది. జక్కన్నబాలన్స్ చేసిన విధానాన్ని ఆడియన్స్ మెచ్చుకున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ప్రస్తావన అనవసరం. పైగా చరణ్ తారక్ మధ్య ఘాడమైన స్నేహం ఉందని తెలిసి కూడా కొందరు ఫ్యాన్స్ ఇలా చేయడం విచారకరం. సినిమా ఆస్కార్ దాకా వెళ్తే వీళ్ళ ఆలోచన మాత్రం అట్టడుగునే ఉంది.