కింగ్ మేకర్ చేతిలో ‘మట్కా’ మాఫియా

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా తన మొదటి పీరియాడిక్ మూవీ మట్కా టీజర్ ని ఇవాళ విడుదల చేశారు. పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ ఆ తర్వాత శ్రీదేవి సోడా సెంటర్, కళాపురంతో ఆశించిన ఫలితాలు అందుకోనప్పటికీ ఈసారి భారీ బడ్జెట్ తో ఆడియన్స్ అభిరుచులకు అనుగుణంగా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడు. షూటింగ్ పూర్తవ్వకపోయినా తీసిన వాటి నుంచే మంచి విజువల్స్ ని తీసుకుని కట్ చేయించిన విధానం ఆకట్టుకునేలా ఉంది. కథేంటో కొన్ని క్లూస్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

వైజాగ్ నేపథ్యంలో 1958 నుంచి 1982 దాకా జరిగిన సంఘటనల ఆధారంగా మట్కా జరుగుతుంది. దేశం మొత్తాన్ని ఊపేసిన ఒక రియల్ ఇన్సిడెంట్ చూపించబోతున్నారు. చిన్నప్పుడు ఆదరణ కరువైన ఓ కుర్రాడు(వరుణ్ తేజ్) పెద్దయ్యాక కోట్ల రూపాయలు దందా చేసే మట్కా నెంబర్ల వ్యాపారంలో ఎలా అడుగు పెట్టాడు, కింగ్ మేకర్ గా ఎలా మారాడనే పాయింట్ తీసుకున్నారు కరుణ కుమార్. ఇందులో గాడ్ ఫాదర్ తరహా డ్రామాతో పాటు ఆ కాలంలో జరిగిన కొన్ని షాకింగ్ పరిణామాలు ఉంటాయి. 24 సంవత్సరాల కాలంలో ఒక మట్కా కింగ్ లైఫే మట్కాలో ఆవిష్కరించబోతున్నారు.

నిడివి తక్కువగా ఉన్నా సన్నివేశాల్లో డెప్త్ ఆకట్టుకునేలా ఉంది. జివి ప్రకాష్ నేపధ్య సంగీతం, కిషోర్ కుమార్ ఛాయాగ్రహణానికి తోడు ఆర్ట్ డిపార్ట్ మెంట్ తీసుకున్న శ్రద్ధ వల్ల అప్పటి వాతావరణం ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. హీరోయిన్లు మీనాక్షి చౌదరి, నోరా ఫతేహిలను రివీల్ చేయనప్పటికీ క్యాస్టింగ్ లో భాగమైన రవి చందర్, నవీన్ చంద్ర తదితరులను చూపించారు. విడుదల తేదీ ఇంకా ఖరారు చేయని మట్కాలో వరుణ్ తేజ్ ఇంతకు ముందు చేయని డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాడట. ఇప్పటికీ పలు గ్రామాల్లో పేదల జీవితాలతో ఆడుకుంటున్న మట్కా మూలలను తెరమీద ఎలా చూపిస్తారో.