నయన్ క్షమాపణ ఎందుకు చెప్పింది

చిలికి చిలికి గాలి వానగా మారినట్టు థియేటర్లలో రిలీజైనప్పుడు జనాలు అంతగా పట్టించుకోని అన్నపూరణి ఓటిటిలో వచ్చాక ఎంత పెద్ద రచ్చ చేస్తోందో చూస్తున్నాం. పాలసీల విషయంలో కఠినంగా ఉండే నెట్ ఫ్లిక్స్ సైతం కోర్టు కేసులు, హిందూ సంఘాల అభ్యంతరాలు, వివాదాలు భరించలేక తన ప్లాట్ ఫార్మ్ నుంచి సినిమాని తీసేయడం డిజిటల్ వర్గాలను షాక్ కి గురి చేసింది. నిర్మాణ భాగస్వామిగా ఉన్న జీ స్టూడియోస్ పబ్లిక్ ఆపాలజీ చెప్పగా టైటిల్ రోల్ చేసి ఇంత కాంట్రావర్సికి కేంద్ర బిందువుగా నిలిచిన నయనతార కాస్త ఆలస్యంగా క్షమాపణ కోరుతూ ఒక నోట్ విడుదల చేసింది.

ఒక సదుద్దేశంతోనే అన్నపూరణి తీశామని, వ్యక్తిగతంగా ఒక మతానికి చెందిన నమ్మకాలను అవమానించడానికి కాదని, ఒక మహిళ జీవితంలో ఎంత ఆత్మవిశ్వాసంతో పైకి రావొచ్చో చెప్పే లక్ష్యంతోనే తీశామని, మరో కారణం లేదని, ఏది ఏమైనా జరిగిన పరిణామాలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నానని ఒక సుదీర్ఘమైన నోట్ ని ట్వీట్ చేసింది. ఉత్తరం పైన ఎడమ వైపున జై శ్రీరామ్ అంటూ ఓం గుర్తుని పెట్టడం గమనార్హం. ఇంకో మూడు రోజుల్లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరుగుతున్న తరుణంలో తన బ్రాండ్ కి జరుగుతున్న డ్యామేజ్ ని సరిదిద్దే ప్రయత్నమని విశ్లేషకులు అంటున్నారు.

రెండు దశాబ్దాల కెరీర్ లో నయనతార ఇలా పబ్లిక్ గా సారీ చెప్పే సందర్భం కేవలం అన్నపూరణి వల్లే వచ్చింది. మతాంతర ప్రేమలు వివాహాలు చూపించడం తప్పు కాకపోయినా ఒక కులానికి సంబంధించిన కట్టుబాట్లను, సంప్రదాయాలను హేళన చేసే విధంగా దర్శకుడు నీలేష్ కృష్ణ ఈ సినిమాని తీర్చిదిద్దిన తీరు ఇంత రచ్చకు దారి తీసింది. అధికారిక మార్గంలో ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడా అందుబాటులో లేదు. మళ్ళీ ఎడిట్ చేసి అందరికీ ఆమోద్యయోగం అనిపించే వెర్షన్ ని రిలీజ్ చేస్తామని నిర్మాతలు అంటున్నారు కానీ అదంత సులభంగా జరిగే పనిలా కనిపించడం లేదు.