పవన్ ఆ పాట పేరెత్తాడో లేదో..

చిన్నా పెద్దా అని తేడా లేకుండా తన పుట్టిన రోజు నాడు శుభాకాంక్షలు చెప్పిన సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన వాళ్లందరికీ పవన్ కళ్యాణ్ ఎంతో ఆత్మీయంగా బదులివ్వడం, ధన్యవాదాలు చెప్పడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏదో మొక్కుబడిగా థ్యాంక్స్ చెప్పి ఊరుకోవడం కాకుండా.. వాళ్ల మెసేజ్‌లను శ్రద్ధగా చదివి.. తగు రీతిలో బదులిచ్చాడు పవన్.

ఈ సందర్భంగా అవతలి వ్యక్తుల ప్రత్యేకతను గుర్తు చేస్తూ, వాళ్ల ప్రతిభను కొనియాడటం విశేషం. సత్యదేవ్‌కు బదులిస్తూ అతడి కొత్త సినిమా ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’లో నటనను ప్రశంసించడం విశేషం. ఇలాగే తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్‌కు బదులిస్తూ.. అతడికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాలోని పాట గురించి పవన్ ప్రస్తావించడం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. అటు తమిళ ప్రేక్షకులే కాదు.. తెలుగు వాళ్లనూ ఈ ట్వీట్ ఆశ్చర్యపరిచింది.

Varuthapadatha Vaalibar Sangam - Oodhaa Kalaru Video | Sivakarthikeyan

ఊదా కలర్ రిబ్బన్ అంటూ సాగే శివ కార్తికేయన్ పాట గురించి పవన్ ప్రస్తావించాడు. అది ‘వరుత్తు పడాద వాలిబర్ సంఘం’ (తెలుగులో కరెంటు తీగ పేరుతో రీమేక్ అయింది) సినిమాలోని పాట. ఈ చిత్ర సంగీత దర్శకుడు డి.ఇమాన్ స్వయంగా ఈ పాట పాడాడు. అందులో మన తెలుగమ్మాయి శ్రీదివ్య హీరోయిన్ కావడం విశేషం. అప్పట్లో ఈ పాట సూపర్ హిట్టయింది.

తమిళ జనాల నోళ్లలో నానింది. ఈ పాట గురించి పవన్‌కు తెలియడం.. ఇప్పుడు శివకు ఇచ్చిన రిప్లైలో ఈ పాట తనకెంతో ఇష్టమని ప్రస్తావించడం నెటిజన్లలో ఆసక్తి రేకెత్తించింది. పవన్ ఈ పాట గురించి ప్రస్తావించడం ఆలస్యం.. అతడి అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు చాలామంది ఈ పాట కోసం వెతకడం మొదలుపెట్టారు. దీంతో ఆ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది.

ఈ సినిమా ఆడియో హక్కులున్న సోనీ మ్యూజిక్ సంస్థ.. ‘ఊదా కలర్ రిబ్బన్’ పాట అనుకోకుండా ఇప్పుడు ట్రెండ్ అవుతోందంటూ ట్వీట్ కూడా వేసింది. దీన్ని బట్టి సోషల్ మీడియాలో పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.