గత కొన్ని వారాలుగా దక్షిణాది సంగీత ప్రియులకు రోజులు చాలా భారంగా, ఆందోళనకరంగా గడుస్తున్నాయి. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడటం.. ఒక దశలో ఆయన పరిస్థితి విషమించడమే అందుక్కారణం. వెంటిలేటర్ ద్వారా ఆయనకు శ్వాస అందించాల్సి రావడం, రోజుల తరబడి అదే పరిస్థితి కొనసాగడం, ఒక దశలో బాలు బతకడం కష్టమే అన్నట్లు వార్తలు రావడంతో తీవ్ర ఆందోళన, ఆవేదన నెలకొంది సంగీత ప్రియుల్లో.
తన పాటల ద్వారా బాలు పంచిన ఆనందం ఎలాంటిదో ఆయన అభిమానులకు తెలుసు. అందుకే ఆయన అనారోగ్యం పాలై పరిస్థితి విషమించగానే తట్టుకోలేకపోయారు. వారి ఆందోళన గమనించే బాలు తనయుడు రోజు వారీ అప్ డేట్లు ఇస్తూ వచ్చాడు. కొన్ని రోజుల కిందట బాలు విషమ స్థితి నుంచి బయటపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ ప్రమాదం మాత్రం తొలగిపోలేదు.
యథాతథ స్థితి కొనసాగుతుండటంతో బాలు ఆరోగ్యం గురించి కొత్త అప్ డేట్స్ ఏమీ లేకపోయాయి. ఐతే బాలు పూర్తిగా కోలుకున్నారు, డిశ్చార్జ్ కాబోతున్నారు అనే వార్త కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ రోజు దగ్గర పడ్డట్లు కనిపిస్తోంది. తాజా అప్ డేట్లో ప్రశాంతంగా కనిపించిన ఎస్పీ చరణ్.. అంతా అనుకూలిస్తే వచ్చే సోమవారం బాలు గురించి శుభవార్త వింటామని అన్నాడు.
ఈ అప్ డేట్ బాలు అభిమానులకు అమితానందాన్ని కలిగించింది. సోమవారం శుభవార్త అంటే.. బాలు పూర్తిగా కోలుకున్నారు, డిశ్చార్జ్ కాబోతున్నారు అన్నదే అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా బాలు ప్రస్తుతం మామూలుగా మాట్లాడుతున్నారని.. పూర్తి తెలివితో ఉన్నారని.. అప్పుడప్పుడూ వెంటిలేటర్ కూడా తీస్తున్నారని వార్తలొస్తున్నాయి. బాలు ప్రస్తుతం ఆసుపత్రి నుంచి పాడినట్లుగా ఒక పాట కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుండటం విశేషం.