వెంకటేష్‍ మాత్రం కదిలి రావట్లేదు

‘వైల్డ్ డాగ్‍’ షూటింగ్‍ నాగార్జున మొదలు పెట్టడంతో ‘నారప్ప’ షూటింగ్‍ వెంకటేష్‍ కూడా తిరిగి మొదలు పెట్టేస్తారని భావించారు. కానీ వెంకటేష్‍ కానీ, ఆయన సోదరుడు సురేష్‍ కానీ ఇప్పుడు షూటింగ్‍ చేయడానికి అసలు సుముఖంగా లేరు. నారప్ప నిర్మాత సురేష్‍ కావడం వల్ల వెంకటేష్‍కి ఎలాంటి ఒత్తిళ్లు లేవు. అలాగే ఆయన వెంటనే చేసేయాల్సిన ప్రాజెక్టులు కూడా లేవు. అరవయ్యేళ్లు పైబడిన వాళ్లు ఇప్పుడు బయట తిరగడం మంచిది కాదని ప్రభుత్వం మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నా నాగార్జున ‘బిగ్‍బాస్‍’ కోసం బయటకు రాక తప్పలేదు.

అలా వచ్చిన తర్వాత ఆయనకు ఇక భయాలన్నీ పోవడంతో వైల్డ్ డాగ్‍ షూటింగ్‍ కూడా మొదలు పెట్టేసారు. కానీ వెటరన్‍ స్టార్స్ అయిన చిరంజీవి, వెంకటేష్‍, బాలకృష్ణ మాత్రం ఇప్పుడు వచ్చిన తొందర ఏమీ లేదని డిసైడ్‍ అయిపోయారు. షూటింగ్‍ మొదలు పెట్టేసిన వారిని చూసి మిగతా అందరూ కదిలి వచ్చేస్తారని అనుకున్న వారికి చిత్ర పరిశ్రమ యథాస్థితికి రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని అర్థమయింది. వెంకటేష్‍ కోసం అనిల్‍ రావిపూడి, తరుణ్‍ భాస్కర్‍ ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. కానీ నారప్ప షూట్‍ మళ్లీ మొదలై, పూర్తయ్యే వరకు వారికి ఎదురు చూపులు తప్పవు.