రిపబ్లిక్ వారం డబ్బింగులకు ఇచ్చేద్దాం

రాబోయే వారం లాంగ్ వీకెండ్ ని టాలీవుడ్ పూర్తిగా డబ్బింగ్ సినిమాలకు వదిలేసింది. కెప్టెన్ మిల్లర్ జనవరి 25, ఆయలాన్ 26 వరసగా ఒక్క రోజు గ్యాప్ తో విడుదల కాబోతున్నాయి. ముందుగా అనుకున్న ప్లానింగ్ ప్రకారమైతే వర్మ శపథం రావాలి. కానీ కోర్టు బ్రేకులు వేయడంతో ఆగిపోయింది. షూటింగ్ ఇంకా పూర్తి కాని కారణంగా నారా రోహిత్ ప్రతినిధి 2 పోస్ట్ పోన్ చేశారు. దీంతో ఓపెన్ గ్రౌండ్ ని వాడుకునే దిశగా తెలుగు నిర్మాతలు ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. దానికి తోడు సంక్రాంతి బ్లాక్ బస్టర్ల జోరు ఇంకో వారం పది రోజులు బలంగా ఉండే సూచనలున్నాయి కాబట్టి వదిలేస్తున్నారు.

ఇవి కాకుండా హృతిక్  రోషన్ ఫైటర్ కి ఏపీ, తెలంగాణలో ఊహించని విధంగా మంచి రిలీజ్ దక్కబోతోంది. అప్పటికి పండగ చిత్రాలు నెమ్మదించి ఉంటాయి కాబట్టి ధనుష్, శివ కార్తికేయన్ ల మీద  ఆసక్తి లేని వాళ్ళు దీనికి ఓటేసే ఛాన్స్ లేకపోలేదు. తెలుగు డబ్బింగ్ ఉంటుందా లేదా ఇంకా చెప్పడం లేదు. వరస చూస్తుంటే హిందీ వెర్షన్ కే పరిమితం చేసేలా ఉన్నారు. అదే  నిజమైతే  బిజినెస్ యాంగిల్ లో ఒక మంచి అవకాశం మిస్ అయినట్టే. హనుమాన్ అప్పటికి స్ట్రాంగ్ గా ఉందనుకున్నా నా సామిరంగ, గుంటూరు కారం స్లో అవుతాయి. సో కొత్త వాటికి ఛాన్స్ ఉంటుంది.

ఈ రకంగా మంచి లాంగ్ వీకెండ్ ని టాలీవుడ్ వదులుకున్నట్టయ్యింది. కొంచెం ప్లాన్ చేసుకుని ఈగల్ ని వదిలినా బాగుండేది. సోలో రిలీజ్ హామీ ఇచ్చి నిర్మాతల మండలి దాన్ని ఫిబ్రవరి 9కి పంపిస్తే తీరా అక్కడ యాత్ర 2, ఊరి పేరు భైరవకోన మేము వాయిదా వేసుకోమంటూ మొండిపట్టు వేసుకుని కూర్చున్నాయి. దీంతో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. ఆ నెల మొత్తం కాంపిటీషన్ ఇలాగే ఉండబోతోంది. ఒకవేళ రిపబ్లిక్ డేకి ఈగల్ ని వదిలి ఉంటే నాలుగు రోజుల వారాంతంతో పాటు పధ్నాలుగు రోజుల ఫ్రీ గ్రౌండ్ దొరికేది. మొత్తానికి చేతులారా ఒక మంచి వారాన్ని టాలీవుడ్ వదిలేసుకున్నట్టు అయ్యింది.