గత కొన్నేళ్లుగా బాకీగా మిగిలిపోయిన హిట్టుని ఎట్టకేలకు నా సామిరంగతో అందుకున్నారు నాగార్జున. ముఖ్యంగా మాస్ కి ఈ సినిమా కనెక్ట్ అయిన విధానం హెచ్చుతగ్గులను కవర్ చేసేసి విజయాన్ని ఖాతాలో వేసింది. ఇందులో హీరోయిన్ గా చేసిన ఆశికా రంగనాథ్ మీద క్రమంగా దర్శకుల దృష్టి మళ్లుతోంది. ఈ అమ్మాయి కన్నడిగ. 2016లో క్రేజీ బాయ్ తో తెరంగేట్రం చేసింది. తర్వాత శివరాజ్ కుమార్, శ్రీమురళి, సుదీప్ లాంటి అగ్ర హీరోల చిత్రాల్లో ఆఫర్లు పట్టింది కానీ ఆశించిన స్థాయిలో పెద్ద బ్రేక్ దక్కలేదు. తమిళ్ డెబ్యూ పటత్తు అసురన్ కూడా సూపర్ ఫ్లాప్ ని ఖాతాలో వేసింది.
కట్ చేస్తే గత ఏడాది కళ్యాణ్ రామ్ అమిగోస్ తో తెలుగులో కాలు పెట్టింది. కలిసి రాలేదు. బొమ్మ డిజాస్టర్. తిరిగి ఎదురు చూపులు తప్పలేదు. నెలల తరబడి వెయిటింగ్ తర్వాత నా సామిరంగ వచ్చింది. అరవై దాటిన నాగార్జున లాంటి సీనియర్ స్టార్ హీరోతో చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేయకుండా కథ నచ్చేసి వెంటనే ఒప్పేసుకుంది. నాగ్, అల్లరి నరేష్ లకు ధీటుగా మాస్ లో ఆశికాకు గుర్తింపు వచ్చింది. యవ్వనం, మధ్య వయసు దగ్గరగా రెండు వేరియేషన్లను చూపించిన తీరు ఆకట్టుకుంది. గ్లామర్, యాక్టింగ్ రెండూ బ్యాలన్స్ చేసిన తీరు మంచి మార్కులు సాధించి పెట్టింది.
టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్ల కొరతను తనకు అనుకూలంగా ఆశికా ఏ మేరకు వాడుకుంటుందో చూడాలి. సీనియర్ల పక్కన జోడి కట్టేందుకు అభ్యంతరం లేదంటే ఆఫర్లకు కొదవ ఉండకపోవచ్చు. ఎందుకంటే చిరు, బాలయ్య, వెంకీలు ఎదురుకుంటున్న ఓ సమస్యకు పరిష్కారం దొరికినట్టవుతుంది. శ్రీలీల ముందు రవితేజతో బ్లాక్ బస్టర్ కొట్టాకే మహేష్ బాబు దాకా వచ్చింది. సో హీరోల ఏజ్ లెక్కలు వేసుకోకుండా కథలో ప్రాధాన్యం వరకు చూసుకుంటే ఎనిమిదేళ్ల తర్వాత వచ్చిన పెద్ద బ్రేక్ ని నిలబెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఆశికా కథలు వినే పనిలో ఉంది. ఇంకా ఫైనల్ అవ్వలేదు.