గుంటూరు కారంలో మహేష్ బాబు తాగినన్ని బీడీలు బహుశా ఆయన కెరీర్ మొత్తంలో ఏ సినిమాలోనూ ట్రై చేసి ఉండరు. ఒక్కడు, పోకిరి లాంటి వాటిలో సిగరెట్లు కనిపిస్తాయి అంతే. అయితే బీడీ ఇచ్చే మాస్ ఇంపాక్ట్ వేరే. అందుకే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏరికోరి మరీ వెంకటరమణకు ఆ అలవాటు పెట్టించాడు. ఫ్యాన్స్ గురించి తెలిసిందేగా. కొందరు ప్రభావం చెంది ఇదేదో స్టయిలిష్ గా బాగుందే తాగి చూద్దామని అలవాటు చేసుకునే ప్రమాదం లేకపోలేదు. తాజాగా యాంకర్ సుమకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు ఆ బీడీ వెనుక అసలు రహస్యాన్ని స్పష్టంగా వివరించాడు.
షూటింగ్ స్టార్ట్ అయిన టైంలో మహేష్ కి ఒరిజినల్ బీడీనే ఇచ్చారు. ఒక్కసారి కాల్చగానే తలనొప్పి వచ్చేసి వికారం పుట్టింది. దీంతో తన వల్ల కావడం లేదని, ఏదైనా ఉపాయం ఆలోచించమని చెబితే సెట్ వాళ్ళు ఆయుర్వేదిక్ బీడీ ఒకటి తెచ్చారు. అందులో పొగాకు ఉండదు. లవంగం, పుదీనా లాంటి ఆరోగ్యకరమైన దినుసులతో తయారు చేయించారు. మొదటిసారి టేస్ట్ చేస్తే ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో వెంటనే వాటిని ఎక్స్ ట్రా ఆర్డర్ పెట్టేశారు. ప్రతి రోజు షూట్ అయిపోయాక వాటిని భద్రంగా ప్యాక్ చేసి భద్రపరిచేవారు. ఇదన్న మాట అసలు సీక్రెట్.
స్వతహాగా మహేష్ బాబు ధూమపానం ఇష్టపడడు. ప్రోత్సహించడు కూడా. స్పైడర్, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వేటిలోనూ కనిపించదు. కానీ గుంటూరు కారం ఊర మాస్ ఎంటర్ టైనర్ కావడం వల్ల రమణ పాత్ర కోసం గుప్పు గుప్పు మనిపించక తప్పలేదు. క్యారెక్టర్ లోని అప్పీల్ దాని వల్లే పెరిగిందనేది నిజం. సో దీన్ని బట్టి అభిమానులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీడీ కాల్చేందుకు స్టయిల్ గా ఉంటుంది కానీ దాని వల్ల వచ్చే ఫలితం చాలా ప్రమాదం. ఒకవేళ హీరోని ఫాలో కావాలంటే అవేవో ఆయుర్వేదిక్ బీడీలకి షిఫ్ట్ అయిపోతే అందరికీ మంచిది.